చైనాలో ముగ్గురు పిల్లల్ని కనేందుకు గ్రీన్ సిగ్నల్..

దేశంలో దారుణంగా పడిపోతున్న జననాల రేటును తిరిగి పెంచేందుకు చైనా ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఇకపై ప్రతి ఒక్కరు ముగ్గురు పిల్లల్ని కనేందుకు అధికార కమ్యూనిస్ట్ పార్టీ తీసుకొచ్చిన ప్రతిపాదనకు ఆ దేశ పార్లమెంట్ ‘నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్’ (ఎన్‌పీసీ) స్థాయీ సంఘం నిన్న గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి తగ్గట్టుగా కుటుంబ నియంత్రణ చట్టానికి సవరణ చేసింది.

పెరుగుతున్న ఖర్చుల నేపథ్యంలో అధిక సంతానానికి ప్రజలు విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం తాజా ప్రతిపాదన తీసుకొచ్చింది. కుటుంబాలపై పడే భారం, పిల్లలను పెంచేందుకు, చదువుకు అయ్యే వ్యయాలను తగ్గించడంతోపాటు ఆర్థిక సాయం కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రతిపాదనను తీసుకొచ్చింది. కాగా, ఈ ఏడాది మేలో ఇద్దరు పిల్లల విధానాన్ని సడలించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ముగ్గురు పిల్లల్ని కనేందుకు అనుమతి నిచ్చింది.