శక్తిమంతమైన యువ సమూహం అండతోనే నేరపూరిత వైసీపీతో బలంగా పోరాడుతున్నాను

• నిరంతరం నా వెన్నంటి ఉండేది యువత బలమే
• సగటు మనిషి ఆవేదనలు తీర్చాలంటే చట్టసభల్లో మన గొంతు బలంగా వినబడాలి
• యువతకు భరోసా కల్పించేలా ప్రజా పాలసీలను తీసుకువస్తాం
• జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్
• జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ‘జనసేనానితో గ్లాసు టీ’ కార్యక్రమంలో యువతీయువకుల ఆలోచనలు విన్న శ్రీ పవన్ కళ్యాణ్

‘ఉక్కు నరాలు.. ఇనుప కండరాలు కలిగిన యువ సమూహమే జనసేన బలం.. బలగం. వారి అండతోనే వైసీపీ లాంటి నేరపూరిత ఆలోచనలు ఉన్న పార్టీతో పోరాడగలుగుతున్నాను. దశాబ్ద కాలంపాటు నన్ను అన్ని విధాలా నమ్మి, నా లక్ష్య సాధనలో నాతో యువతరం నిలబడింది. నన్ను వారిలో చూసుకుంటారు.. వారి ఆలోచనల్లో వెతుకుతారు. అలాంటి యువతరానికి కచ్చితంగా నేను పూర్తి స్థాయిలో అండగా నిలిచే బాధ్యత తీసుకుంటాను’ అని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు. స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకొని జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో విభిన్న రంగాల నుంచి, విభిన్న ప్రాంతాల నుంచి వచ్చిన యువతీ యువకులతో ‘జనసేనానితో గ్లాసు టీ’ అనే కార్యక్రమం ద్వారా శ్రీ పవన్ కళ్యాణ్ గారు సమావేశమయ్యారు. ముందుగా స్వామి వివేకానంద చిత్రపటానికి అంజలి ఘటించారు. అనంతరం వివిధ అంశాలు, విభిన్నమైన విషయాలపై యువత ఆలోచనలను అడిగి తెలుసుకున్నారు. సరికొత్త ఆంధ్రప్రదేశ్ కోసం నేటి తరం ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో శ్రద్ధగా విన్నారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ‘’యువత ఆలోచనలు చాలా విస్తృతంగా, విభిన్నంగా ఉంటాయి. నవతరం ప్రతినిధులతో మాట్లాడిన ప్రతిసారీ కొత్త ఉత్తేజం కలుగుతుంది. దేశం కోసం నిలబడడానికి, సమాజానికి నా వంతుగా ఏదైనా మేలు చేయాలి అనే దృక్పథంతో రాజకీయ ప్రయాణం ప్రారంభించాను. సమాజంలో జరిగే అన్ని విషయాల మీద యువతలాగే నాకూ కోపం ఉంటుంది. కళ్లెదుటే జరిగే దారుణాల మీద నాలోనూ ఆవేశం ఉంటుంది. నా కోపం, ఆవేశం ఇలా వచ్చి అలా వెళ్లిపోయేవి కాదు. సమస్య మూలం వెతికి దాని మీద పూర్తిస్థాయి దృష్టి నిలిపి పరిష్కారం కోసం ఆలోచిస్తాను.
• రాష్టంలో వలసలు ఆగాలి
రాజధానితోపాటు అన్ని జిల్లాల్లోనూ ఆర్థిక అభివృద్ధి జరగాలి. అన్ని ప్రాంతాల్లో అవకాశాలు ఉండాలి. ఈ దిశగా నేను ఆలోచిస్తాను. కేవలం ఐటీ సెక్టార్ మాత్రమే గౌరవప్రదమైనది, ఉన్నతమైనది అనే ఆలోచన కాకుండా, వ్యవసాయం, వ్యాపారం ఇతర రంగాలు కూడా అద్భుతమైనవి అనేలా తీర్చిదిద్దాలి. సొంత ప్రాంతాల్లో సరైన అవకాశాలు రాక, చదివిన చదువుకు ఉద్యోగాలు లేక యువత ఎక్కడెక్కడికో వలసలు వెళ్లి సాధారణ జీతాలకు పని చేస్తున్నారు. ఈ పద్ధతి మారాలి. యువత సాధికారత దిశగా ఆలోచించాలి. నాకోసం అని కాకుండా సమాజం కోసం నేను ఏం చేయగలుగుతున్నాను అన్న విషయం మీద కూడా దృష్టి పెట్టాలి. నేను అధికారంలోకి వస్తే ఇది చేస్తాను అది చేస్తాను… అని చెప్పను. అందరికీ ఉపయోగపడే పనులు మాత్రం కచ్చితంగా చేస్తానని మాట ఇస్తున్నాను. సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన నా ఆలోచనలు అన్నీ సగటు మనిషి ఎలా ఆలోచిస్తారో అలాగే ఉంటాయి. అందుకే సామాన్యుడి ఆకాంక్షలకు ప్రతిరూపంగా నన్ను భావిస్తారు. వారు నాకు సమస్య చెబితే కచ్చితంగా తీరుతుంది అని నమ్మడం నన్ను కదిలిస్తుంది. ఎన్నో ఆవేదనలు విన్న తర్వాత వాటి నుంచి వచ్చిన ఆలోచనలే నా మాటల రూపంలో బయటకు వస్తాయి. అందుకే సాధారణ తరగతి కుటుంబాల్లో నుంచి వచ్చిన యువతరం నన్ను వారిలో చూసుకుంటారు. కానీ ఏదైనా చెప్పడం కానీ, సమస్యకు పరిష్కారం కానీ కావాలంటే కచ్చితంగా చట్టసభల్లో మన గొంతు వినిపించాలి. 15 ఏళ్లకు పైగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో తిరిగాను.. సమస్యలను తెలుసుకున్నాను. పూర్తి అవగాహన ఉంది. వాటిని పరిష్కరించడానికి కచ్చితంగా అధికారం కావాలి. చట్టసభల్లో జనసేన ఉండాలి. సమస్యలను తీర్చే స్థాయిలో మనం ముందడుగు వేయాలి.
• గంజాయి దెబ్బకు యువత నిర్వీర్యం
వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గంజాయి విచ్చలవిడిగా దొరుకుతోంది. ఇది నేరాలకు ప్రధాన మూలం. గంజాయి మత్తులో నేరాలు పెరిగాయి. నేరాలను అరికట్టాలంటే ముందుగా గంజాయి ముఠాలను కట్టడి చేయాలి. గంజాయి రవాణా మూలాలను నాశనం చేయాలి. నేను అధికారం లేనప్పుడే యువతరంతో ఎక్కువగా మాట్లాడాను. అధికారంలోకి వచ్చాక వారి గొంతు అవుతా. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం సమస్యను కూడా ఇద్దరు యువకులు నా దృష్టికి తీసుకువచ్చారు. దానిపై బలమైన పోరాటం చేయగలిగాం. ప్రపంచానికి సమస్య తెలియజేశాం. నేను యువత చెప్పే ప్రతి ఆలోచనలను జాగ్రత్తగా వింటాను. అవసరమైతే అన్నీ ఆలోచించి ప్రజా పాలసీగా తీసుకొస్తాను. వచ్చే ప్రభుత్వంలో జవాబుదారీతనం తీసుకువస్తా. యువతకు మంచి భవిష్యత్ ఇచ్చేలా భరోసా ఇస్తాము” అన్నారు.