వైసీపీలో ఒక్కడే రాజు… అంతా బానిసలే

• ఆ పార్టీతో సమస్యలు పరిష్కారం కావు
• శ్రీ పవన్ కళ్యాణ్ నన్ను తప్పు దారి నుంచి సన్మార్గంలో నడిపించారు
• కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రం ప్రగతి బాట
• విశాఖ దక్షిణ నియోజకవర్గం వారాహి విజయభేరి సభలో టీమిండియా క్రికెటర్, జనసేన స్టార్ క్యాంపెయినర్ శ్రీ అంబటి రాయుడు

‘తప్పుడు దారిలో పయనిస్తున్న నన్ను సన్మార్గంలో నడిపిస్తున్నందుకు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. నన్ను మాత్రమే కాదు రాష్ట్రం మొత్తాన్ని ఆయన తప్పుదారి నుంచి మళ్ళిస్తున్నార’ని టీమిండియా క్రికెటర్, జనసేన పార్టీ స్టార్ క్యాంపెయినర్ శ్రీ అంబటి రాయుడు స్పష్టం చేశారు. వైసీపీతో ఒక్క సమస్య కూడా పరిష్కారం కాదని, కూటమి ప్రభుత్వ స్థాపనతోనే రాష్ట్రం ప్రగతి బాట పడుతుందని అన్నారు. గురువారం రాత్రి విశాఖ దక్షిణ నియోజకవర్గంలో జరిగిన వారాహి విజయభేరీ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా శ్రీ అంబటి రాయుడు మాట్లాడుతూ..”రాష్ట్రంలో ఉన్న 50 శాతం యువతే రాష్ట్ర భవిష్యత్తు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఏర్పాటు కానున్న కూటమి ప్రభుత్వంలోనే రాష్ట్రం బాగుపడుతుంది. అంతా కలసి కట్టుగా వైసీపీ అరాచకాన్ని సమాప్తం చేయాలి. ఈ ఎన్నికలు మనకో మంచి అవకాశం. ఈ ఎన్నికలు చాలా కీలకం. కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తే బీజేపీ మద్దతుతో విశాఖ లాంటి నగరాలు మరింత అభివృద్ధి చెందుతాయి. ఎన్నో పరిశ్రమలు వస్తాయి. ఉపాధి అవకావాలు వస్తాయి. మనందరి భవిష్యత్తు బాగుంటుంది.
• శ్రీ పవన్ కళ్యాణ్ జనం కోసం నిలబడతారు
వైసీపీలో ఏడు నెలలు రాష్ట్రం మొత్తం పర్యటించాను. ఎన్నో సమస్యలు చూశాను. అక్కడ ఒక్క సమస్యకు కూడా పరిష్కార మార్గం కనబడలేదు. వైసీపీలో బానిసత్వం తప్ప ఏమీ లేదు. ఒక్కడే రాజు అతని కాలు కింద రాష్ట్రం మొత్తాన్ని పెట్టి బానిసత్వం చేయిస్తున్నాడు. రాష్ట్రం వెనుకబాటు చూస్తే కడుపు తరుక్కుపోతోంది. శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే మీ కోసం నిలబడతారు. రాష్ట్రాన్ని సరైన దారిలో ముందుకు తీసుకువెళ్తారు. మంచితనానికి, ప్రగతికి ఓటు వేయండి. కూటమికి మద్దతు ఇస్తేనే రాష్ట్రం ప్రగతిబాట పడుతుంది.
• దుర్మార్గ పాలనను దించేందుకే కూటమి కట్టాం: శ్రీ భరత్, టీడీపీ విశాఖ ఎంపీ అభ్యర్ధి
టీడీపీ ఎంపీ అభ్యర్ధి శ్రీ భరత్ మాట్లాడుతూ.. “వైసీపీ పాలనలో రాష్ట్రం నష్టపోయింది. రూ. 13.5 లక్షల కోట్ల అప్పులు ఉంటే రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయి. గత ఐదేళ్లలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు లేవు. యువతకు ఉద్యోగాలు లేవు. టీడీపీ ప్రభుత్వం తెచ్చిన ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ని పంపేశారు. విశాఖలో గంజాయి పెరిగిపోయింది. క్రైమ్ రేట్ పెరిగిపోయింది. యువత భవిష్యత్తు నాశనం అవుతోంది. చెత్త పన్ను కడుతున్నా డ్రైనేజీ సమస్య తీర్చరు. ఆస్తి పన్ను కట్టించుకుంటారు వీధి లైట్లు కూడా వేయరు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు కష్టకాలంలో టీడీపీకి అండగా నిలవడమే కాకుండా రాష్ట్ర బాగు కోసం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా కూటమి కట్టేలా కృషి చేశారు. దుర్మార్గ పాలనను దించేందుకు మూడు పార్టీలు కలసి వచ్చాం. కూటమి ప్రభుత్వం పదేళ్లు పాలిస్తే రాష్ట్రం ప్రగతి తిరిగి దారిన పడుతుందని అన్నారు.
• జగన్ ని నమ్ముకుని నష్టపోయా: శ్రీ వంశీ కృష్ణయాదవ్, విశాఖ దక్షిణ జనసేన అభ్యర్ధి
విశాఖ దక్షిణ జనసేన పార్టీ అభ్యర్ధి శ్రీ వంశీకృష్ణ యాదవ్ మాట్లాడుతూ.. “రాష్ట్రాన్ని దోచుకుంటూ బడుగు బలహీన వర్గాల ఆశల మీద నీళ్లు చల్లుతున్న ఈ ప్రభుత్వాన్ని పారద్రోలాలి. ఈ ప్రభుత్వం బీసీలను 56 కులాలుగా విడదీశారు. ఒక్క కులానికీ ఒక్క రూపాయి ఇచ్చింది లేదు. జగన్ మాత్రం తన కోరికలు తీర్చుకోవడానికి రుషి కొండకు గుండు కొట్టించేశాడు. జగన్ ని నమ్ముకుని నేను నష్టపోయా. ప్రజలు నష్టపోయారు. స్థానిక ఎమ్మెల్యే రెండుసార్లు గెలిచినా సమస్యలు పట్టించుకోకుండా తిరుగుతున్నాడు. విశాఖ దక్షిణంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. పోర్టు కాలుష్యం కాటేస్తోంది. దశాబ్దాలుగా నివాసం ఉంటున్న వారి భూములు 22ఏ జాబితాలోకి చేర్చారు. ప్రజల సమస్య పట్టించుకునే వారు లేరు అలాంటి వారికి బుద్ది చెప్పాలి. నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి. విశాఖ దక్షిణ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాను” అన్నారు. ఈ సభలో విశాఖ నగరం నుంచి అసెంబ్లీ బరిలో దిగుతున్న టీడీపీ, బీజేపీ అభ్యర్ధులు శ్రీ పల్లా శ్రీనివాస్, శ్రీ వెలగపూడి రామకృష్ణబాబు, శ్రీ గణబాబు, శ్రీ విష్ణుకుమార్ రాజు ప్రసంగించారు.