Ind vs NZ: ముగింపు అదిరింది.. సిరీస్ భారత్ కైవసం
రోహిత్ శర్మ, రాహుల్ ద్రావిడ్ జోడీ ఆరంభం అదిరింది. టీమిండియా టీ20 కెప్టెన్‌గా రోహిత్, జట్టు కోచ్‌గా ద్రావిడ్ బాధ్యతలు చేపట్టిన తొలి సిరీస్‌లోనే తిరుగులేని విజయాన్ని అందించిపెట్టారు. న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను రోహిత్ సేన 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో గత రాత్రి జరిగిన చివరి మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. ఈసారి టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ చేసినప్పటికీ ఫలితంలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. 73 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి తొలి సిరీస్‌ను సొంతం చేసుకుంది.
భారత్ నిర్దేశించిన 184 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ను భారత బౌలర్లు బెంబేలెత్తించారు. అక్సర్ పటేల్ దెబ్బకు కివీస్ టాపార్డర్ పేకమేడలా కుప్పకూలింది. ఆపై హర్షల్ పటేల్, ఇతర బౌలర్లు మిగతా పనిని పూర్తి చేశారు. భారత బౌలర్ల నిప్పులు చెరిగే బంతులను ఎదురొడ్డుతూనే ఓపెనర్ మార్టిన్ గప్టిల్ అద్భుతంగా ఆడాడు. 36 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో అర్ధ సెంచరీ (51) పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత టిమ్ సీఫర్ట్ చేసిన 17 పరుగులే జట్టులో అత్యధికం. చివర్లో లాకీ ఫెర్గ్యూసన్ 14 పరుగులు చేశాడు. మిగతా వారిలో ఎవరూ రెండంకెల స్కోరు కూడా సాధించలేకపోయారు. ఫలితంగా 17.2 ఓవర్లలో 110 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. భారత బౌలర్లలో అక్సర్ పటేల్ 3, హర్షల్ పటేల్ 2, దీపక్ చాహర్, యుజ్వేంద్ర చాహల్, వెంకటేశ్ అయ్యర్ చెరో వికెట్ తీసుకున్నారు.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. కేఎల్ రాహుల్, అశ్విన్‌కు విశ్రాంతి ఇచ్చి ఇషాన్ కిషన్ యుజ్వేంద్ర చాహల్‌కు తుది జట్టులో స్థానం కల్పించింది. క్రీజులోకి దిగినప్పటి నుంచే ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ చెలరేగిపోయారు. ఇద్దరూ కలిసి యథేచ్ఛగా షాట్లు కొడుతూ స్కోరు బోర్డును ఉరకలెత్తించారు. ఈ క్రమంలో 21 బంతుల్లో 6 ఫోర్లతో 29 పరుగులు చేసిన ఇషాన్ కిషన్‌ను శాంట్నర్ పెవిలియన్ పంపడంతో 69 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత చెలరేగిన శాంట్నర్ వెంటవెంటనే సూర్యకుమార్ యాదవ్ (0) పంత్ (4)ను వెనక్కి పంపాడు. దీంతో భారత్ స్కోరు కాస్తంత నెమ్మదించింది.
క్రీజులో ఉన్న రోహిత్ మాత్రం బ్యాట్ ఝళిపిస్తూ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 31 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 56 పరుగులు చేసిన రోహిత్ సోదీ బౌలింగులో అతడికే క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. అయితే, ఆ తర్వాత క్రీజులో కుదురుకున్న శ్రేయాస్ అయ్యర్ (25), వెంకటేశ్ అయ్యర్ (20) రాణించడంతో భారత్ భారీ స్కోరు దిశగా పయనించింది. చివరల్లో హర్షల్ పటేల్ (18), దీపక్ చాహర్ (21) మెరుపులు మెరిపించడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. మూడు వికెట్లు తీసి న్యూజిలాండ్‌ను దెబ్బకొట్టిన అక్సర్ పటేల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.