సమస్యల్లో జగనన్న కాలనీలు – కనీస సౌకర్యాలు కరువు

సింగనమల, నార్పల: జగనన్న కాలనీల్లో ఇంటి నిర్మాణం లబ్ధిదారులకు కత్తిమీద సాములా మారిందని జనసేన పార్టీ మండల కన్వీనర్ గంజిగుంట రామకృష్ణ పేర్కొన్నారు. నార్పల మండల కేంద్రంలోని జగనన్న కాలనీలను శనివారం ఆ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న కాలనీల్లో కనీస మౌళిక సదుపాయాలు కరువయ్యాయన్నారు. నార్పల మండలంలో రెండేళ్ల క్రితం పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసిన నేటికీ నిర్మాణ పనులు ముందుకు సాగలేదన్నారు. కాలనీలో రోడ్డు, నీళ్లు, కరెంట్‌ సౌకర్యాలు లేకపోవడంతో లబ్ధిదారులు నిర్మాణాలు చేసుకునేందుకు ఎక్కువ మంది ముందుకు రావడం లేదన్నారు. మౌళిక వసతులైన డ్రైనేజీ, నీరు, రోడ్లు, కరెంటు వంటి వసతులు కూడా కాలనీలో లేనటువంటి పరిస్థితి గమనించడం జరిగింది. కనీస మౌళిక వసతులు ప్రభుత్వం కల్పించకున్నా నిర్మాణ పనులు ఎందుకు మొదలు పెట్టారని లబ్ధిదారులను ప్రశ్నించగా ఇచ్చిన పట్టాలను నాయకుల పేరు చెప్పి కబ్జాలు చేస్తున్నారని, పట్టాదారుల పేర్లు తారుమారవుతున్నాయని, పట్టాలు అధికారులు వెనక్కి తీసుకుంటారని పలు కారణాలు చేత ప్రభుత్వం నుంచి ఏ సహాయం లేకున్నా అప్పుచేసి సొంతంగా నిర్మాణ పనులు మొదలుపెట్టామని, పీఎం ఆవాస్ యోజన లబ్దిదారులకు మాత్రమే బిల్లులు పడుతున్నాయని తమ గోడు వెళ్ళబోసుకున్నారు. అంతేకాకుండా నిర్మాణ పనుల కోసం నీటిని రెండు వేల రూపాయలు వెచ్చించి ట్యాంకర్ల ద్వారా, సమీప వ్యవసాయ బోర్ల యజమానులతో మాట్లాడుకుని నీటిని తెచ్చుకుంటున్నామన్నారు. అనేక సమస్యలు ఉన్న ఈ కాలనీపై సంబంధత అధికారులపై ఒత్తిడితెచ్చి సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు జనసేన పార్టీ కృషి చేస్తుందని వారికి హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ గంజికుంట రామకృష్ణ, తుపాకుల భాస్కర్, షేక్ రహంతుల్లా, పొన్నతోట రామయ్య, ముళ్ల అలీ, హరీష్ కుమార్, గోపాల్, మహబూబ్ బాష, చరణ్ కుమార్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.