ఎన్టీటీపీఎస్ కాలుష్య కోరల్లో నుండి కొండపల్లి ఖిల్లా ని కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన జనసేన

ప్రభుత్వ అధికారుల చేతగాని తనమా???
డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ యాజమాన్య నిర్లక్ష్యమా???

మైలవరం నియోజకవర్గానికి చెందిన చరిత్ర ప్రఖ్యాతి గాంచిన కొండపల్లి ఖిల్లా పర్యాటక ప్రాంతానికి పెట్టింది పేరు, ఇప్పుడు చరిత్రకు బూడిద పొరలు కమ్ముతున్నాయి. నిత్యం విద్యార్థులు, వాహనదారులు బూడిద కారణంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఖిల్లా రోడ్ లోని జనజీవనం అస్తవ్యస్తం అవుతోంది. వీటన్నిటికీ మూలకారణం ఎన్టీటీపీఎస్ నిర్లక్ష్యం… ఒకపక్క బూడిద ఎగిసి పడుతుంటే మరో పక్క బూడిద నీరు నిండా బూడిద కమ్మేసి నీటి కాలుష్యంతో ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు… డాక్టర్ ఎన్టీటీపీఎస్ యాజమాన్యం నిర్లక్ష్య ఫలితంగా స్థానిక ప్రజలు విద్యార్థులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు సైతం తీవ్ర అవస్థలు పడుతున్న దుస్థితి… కొండపల్లి ఖిల్లా రోడ్ లోని బూడిద రవాణా స్థానిక ప్రజలను తీవ్ర అనారోగ్యం బారిన పడ వేస్తోంది.. ఇదే విషయంపై స్థానికులు ఆందోళన బాట పట్టిన వీటీపీఎస్ అధికారుల్లో మాత్రం చలనం లేదు…
ఓ పక్క బూడిదతో అల్లాడిపోతున్న ప్రజలకు మరో పక్క బూడిద నీరు మరింత ఇబ్బంది పెడుతోంది. ఖిల్లాకి వెళ్లే మార్గంలో బూడిద నీరు ప్రవహిస్తూ చెరువులను తలపిస్తుంది. ఈ విషయమై అనేకమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదంటూ స్థానికులు వాపోతున్నారు… బూడిద రవాణా గురించి తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, కాలుష్య నియంత్రణ పాటించాలని ఎన్ని సార్లు స్థానికులు ఫిర్యాదులు చేసిన తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. బూడిద నీరు రోడ్ల మీదకు రావడంతో పర్యాటకులకు, కళాశాలకు వెళ్ళే విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. కనీస జాగ్రత్తలు పాటించకుండా బూడిద రవాణా ఇతర కార్యకలాపాలు సాగిస్తున్న డాక్టర్ ఎన్టీటీపీఎస్ యాజమాన్యంపై కనీస చర్యలు తీసుకోవడం గాని, కాలుష్య నివారణకు తగిన ఆదేశాలు ఇవ్వడం గానీ ప్రభుత్వ అధికారులు ఆదేశాలు జారీ చేయకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రజల ఆరోగ్యం దృష్ట్యా బూడిద కాలుష్య నివారణ చర్యలు చేపట్టాలని జనసేన పార్టీ కృష్ణా జిల్లా కార్యదర్శి లక్ష్మీ కుమారి చింతల డిమాండ్ చేయటం జరిగింది.