జనసేన నేతలు, సానుభూతిపరులను తప్పుడు కేసులతో వేధిస్తున్నారు

•చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్న వైసీపీ నేతలకు ప్రజలే తగిన సమాధానమిస్తారు
చట్టాన్ని గౌరవించాల్సిన ప్రజా ప్రతినిధులే అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుంటే న్యాయబద్ధంగా పోరాడిన జనసేనపై వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ ఒక ప్రకటనలో విమర్శించారు. సత్తెనపల్లి నియోజకవర్గం పరిధిలో జనసేన జెండా కూడా ఎగుర వేయనీయకూడదు అనే నిరంకుశ ధోరణిని అవలంభిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ జెండాలు ఎగురకూడదు అని ఏమైనా చీకటి చట్టం తెచ్చారా? జనసేన పార్టీపై అమిత అభిమానంతో జెండా ఆవిష్కరణ చేసినందుకు రెంటపాళ్ళ గ్రామస్తులపై తప్పుడు కేసులు నమోదు చేసి వేధింపులకు పాల్పడుతున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, పార్టీ నాయకులు బొర్రా అప్పారావు, శ్రీమతి రాజ్యలక్ష్మి, మణికంఠ తదితరులపై కేసులు నమోదు చేశారు. పార్టీకి మద్దతు ఇచ్చిన ఎరువుల వ్యాపారుల దుకాణాలను సీజ్ చేయడం కక్ష సాధింపులకు పరాకాష్ట. లాటరీలు నడుపుతూ, బాధితుల పరిహారం నుంచి వాటాలు తీసుకొంటూ చట్ట విరుద్ధంగా వ్యవహరించే వారిని జనసేన పార్టీ కచ్చితంగా న్యాయస్థానంలోనూ, ప్రజా కోర్టులోను నిలబెడుతుంది. ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడటం మా పార్టీ విధానం. తప్పుడు కేసులతో వేధించే వైసీపీకి ప్రజలే తగిన సమాధానం ఘాటుగా చెబుతారని శ్రీ నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు.