అక్షరధామ్‌ ఆలయంలో కేజ్రీవాల్‌ దీపావళి ప్రత్యేకపూజలు

దేశ రాజధాని నగరంలోని అక్షరధామ్‌ ఆలయంలో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ దీపావళి పూజలు నిర్వహించారు. ఆలయంలో జరిగిన దీపావళి పూజ కార్యక్రమానికి కేజ్రీవాల్ కుటుంబసభ్యులు హాజరయ్యారు. ఈ వేడుకల్లో మంత్రులు మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్ కూడా పాల్గొన్నారు. వేదపండితుల మంత్రోచ్చరణల మధ్య కొనసాగిన ఈ పూజా కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రజలు వీక్షించారు. దిల్లీలో గాలి నాణ్యత తగ్గిపోవడం, కరోనా విజృంభణ నేపథ్యంలో దిల్లీలోని రెండు కోట్ల ప్రజలందరం కలిసి దీపావళి పండుగను జరుపుకొందామంటూ కేజ్రీవాల్‌ విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు.. ఈ దీపావళి రాత్రి 7.39గంటలకు మంత్రాలను పఠిద్దామని.. ప్రసారమాధ్యమాల్లో టీవీల ద్వారా ప్రత్యక్షప్రసారంలో అందరూ వీక్షించి పూజల్లో పాల్గొనాలని ఆయన కోరారు. పూజా కార్యక్రమం అనంతరం కేజ్రీవాల్‌ ట్వీట్‌ చేస్తూ.. ఈ రోజు తన దిల్లీ కుటుంబానికి చెందిన 2కోట్ల మందితో దీపావళి జరుపుకొన్నట్టు తెలిపారు. అందరికీ ఆనందం, ఆరోగ్యం కలగాలని ప్రార్ధిస్తూ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.