నాలెడ్జ్ ఎకానమీగా భారత్‌ను తీర్చిదిద్దేందుకు కొత్త విద్యావిధానం: ప్రధాని మోదీ

జాతీయ విద్యా విధానం-2020 ఉన్నత విద్యావ్యవస్థ మార్పు అంశంపై కేంద్ర విద్యాశాఖ ఈరోజు కాన్ఫరెన్స్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌, ప్రధాని మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ వర్చువల్ సందేశం చేశారు. కేవలం చదువుకోవడమే కాదు నేర్చుకోవడంపైన కొత్త విద్యావిధానం ఫోకస్ చేసినట్లు ప్రధాని తెలిపారు. విద్యార్థుల్లో సృజన్మాతక ఆలోచనలు కలిగించే విధంగా నూతన విద్యావిధానం ఉంటుందన్నారు. ఈ కొత్త విధానంలో తాము ప్యాషన్‌, ప్రాక్టికాలిటీ, పర్ఫార్మెన్స్‌పై దృష్టిపెట్టినట్లు ప్రధాని మోదీ చెప్పారు.

విద్యా విధానం, విద్యా వ్యవస్థ దేశ ఆకాంక్షలను నెరవేరుస్తాయని ప్రధాని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర, స్థానిక సంస్థలు అన్నీ విద్యావ్యవస్థ బాధ్యతలను చూసుకోవాలన్నారు. కానీ ప్రభుత్వాల జోక్యం విద్యావిధానంలో తక్కువగా ఉండాలన్న అభిప్రాయాన్ని ప్రధాని వ్యక్తం చేశారు. టీచర్లు, పేరెంట్స్‌.. విద్యా విధానానికి కనెక్ట్ అయి ఉంటే, అప్పుడు విద్యార్థులు కూడా ఎక్కువ శ్రద్ధ చూపిస్తారన్నారు. ఆ నేపథ్యంలో విద్యా వ్యవస్థ సమగ్రత కూడా పెరుగుతుందన్నారు.

నాలెడ్జ్ ఎకానమీగా భారత్‌ను తీర్చిదిద్దేందుకు కొత్త విద్యావిధానం దోహదపడుతుందని ప్రధాని తెలిపారు. బ్రెయిన్ డ్రెయిన్ వలసలను ఎదుర్కోవాలంటే, సాధారణ ప్రజల స్వప్నాలు నిజం కావాలంటే, భారత్‌లో ప్రపంచ మేటి విద్యా సంస్థలను ఏర్పాటు చేయాలన్నారు. మేటి విద్యా సంస్థలను నెలకొల్పితే.. విద్యార్థులు విదేశాలకు వెళ్లరు అని, మన వర్సిటీల్లోనూ పోటీతత్వం పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కొత్త విద్యా విధానం యువతలో జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని నింపుతుందన్నారు. భవిష్యత్తు తరాలకు అవసరమైన రీతిలో వారిని తీర్చిదిద్దుతుందన్నారు. గ్రామాలు, నగరాలకు చెందిన లక్షలాది మంది కొత్త విద్యావిధానంపై తమ ఫీడ్‌బ్యాక్ ఇచ్చినట్లు చెప్పారు. అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ వర్సిటీలకు చెందిన వైస్ ఛాన్సలర్లు, సీనియర్ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.