KKR vs KXIP: కోల్‌కతాపై పంజాబ్ ఘనవిజయం

ఐపీఎల్ 2020 సీజన్‌ ప్లేఆఫ్ దశకి చేరాల్సిన కీలక సమయంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బ్యాటింగ్‌, బౌలింగ్‌తో ఆల్‌రౌండ్‌షోతో అదరగొడుతూ వరుస విజయాలతో దుమ్మురేపుతోంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో షార్జా వేదికగా సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో మన్‌దీప్ సింగ్ (66 నాటౌట్: 56 బంతుల్లో 8×4, 2×6), క్రిస్‌గేల్ (51: 29 బంతుల్లో 2×4, 5×6) అర్థ సెంచరీలు బాదడంతో పంజాబ్ టీమ్ 8 వికెట్ల తేడాతో సునాయాస విజయం అందుకుంది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా ఓపెనర్ శుభమన్ గిల్ (57: 45 బంతుల్లో 3×4, 4×6), కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (40: 25 బంతుల్లో 5×4, 2×6)లు మాత్రమే రాణించడంతో ఆ జట్టు 9 వికెట్ల నష్టానికి 149 ఓ మోస్తారు స్కోరు మాత్రమే చేయగలిగింది. ఛేదనలో పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ (28: 25 బంతుల్లో 4×4) తక్కువ స్కోరుకే ఔటైనా.. గేల్-మన్‌దీప్ జోడీ రెండో వికెట్‌కి 100 రన్స్ పార్టనర్షిప్ నెలకొల్పి టీమ్‌ని గెలిపించారు. పంజాబ్ టీమ్‌కి ఇది వరుసగా ఐదో గెలుపుకాగా.. 12 మ్యాచ్‌లాడి ఆరు విజయాలతో ఆ జట్టు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరింది. మరోవైపు 12వ మ్యాచ్ ఆడి ఆరో ఓటమిని చవిచూసిన కోల్‌కతా ఐదో స్థానానికి దిగజారింది.