ప్రభుత్వ నిర్లక్ష్యానికి ప్రాణాలు బలి!

* పరిశ్రమల్లో తరచూ ప్రమాదాలు
* తనిఖీలు కరవైన తీరు
* నిద్రపోతున్న నియంత్రణ వ్యవస్థ
* పట్టించుకోని జగన్‌ సర్కారు

ఓసారి భారీ పేలుడు…
మరోసారి గ్యాస్‌ లీకేజి…
ఇంకోసారి విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌…
కారణమేదైతేనేం… పరిశ్రమల్లో తరచు జరిగే ప్రమాదాలలో శ్రమ జీవుల ప్రాణాలు హరించుకుపోతున్నాయి.
అనకాపల్లి జిల్లా రాంబిల్లి సాహితీ ఫార్మా పరిశ్రమలో జరిగిన అగ్నిప్రమాదం తాజా ఉదాహరణ మాత్రమే. ఈ సంఘటనలో రెండు నిండు ప్రాణాలు బలికావడం, నలుగురు తీవ్ర గాయాల పాలై ఆసుపత్రుల పాలవడం వెనుక కారణమేంటో నేడో రేపో తెలుస్తుంది.
కానీ తెలియాల్సింది అది కాదు…
నాలుగేళ్లలో 42 ప్రమాదాలు జరిగితే జగన్‌ ప్రభుత్వం ఏం చేస్తోందని!
మొత్తం 75 మంది అశువులు కోల్పోతే ప్రభుత్వ యంత్రాంగం ఏ చర్యలు తీసుకుందని!
దాదాపు 300 పరిశ్రమలు ఉంటే వాటిలో రక్షణ ఏర్పాట్లపై నిఘా ఉందా లేదాని!
కార్మికుల భద్రతా నిబంధనలు సరిగా అమలతున్నాయా లేదాని!
తరచు జరగాల్సిన పర్యవేక్షణ జరుగుతోందా లేదాని!
నిజానికి ఇవన్నీ సక్రమంగా ఉంటే ప్రమాదాలు జరగనే జరగవు.
అయినా జరుగుతున్నాయంటే… అసలు తెలుసుకోవాల్సింది ఒకటే…
అది… జగన్‌ ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోందని!
వైకాపా సర్కారుకు కార్మికుల ప్రాణాలు గడ్డిపోచల్లాంటివని!
రాంబిల్లి సాహితీ ఫార్మా కంపెనీలో రియాక్టర్‌ దగ్గర జరిగిన భారీ అగ్నిప్రమాదంలో మరణించిన ఇద్దరి కుటుంబీకుల కళ్లలో కన్నీరు తడారలేదు. గాయపడిన వారి కుటుంబాల్లో ఆవేదన చల్లారలేదు. అగ్నికీలలు చుట్టుముడుతుంటే ప్రాణ భయంతో పరుగులు తీసిన కార్మికులు ఆ చేదు అనుభవాన్ని ఇంకా మర్చిపోలేదు.
వీళ్లే కాదు… విశాఖపట్నం, అనకాపల్లి, అచ్యుతాపురం, పరవాడ తదితర ప్రాంతాల్లో విస్తరించిన పారిశ్రామికవాడల్లో కొలువైన వందలాది పరిశ్రమల్లో, వేర్వేరు ప్రాంతాల నుంచి పొట్ట చేత పుచ్చుకుని వచ్చి కార్మికులుగా చేరిన లక్షలాది మంది కార్మికులు, వాళ్ల కుటుంబాల్లో ఎప్పుడేం జరుగుతుందో అనే భయం అంతర్లీనంగా తారాడుతూనే ఉంది. విశాఖ జిల్లా పరవాడ జె.ఎన్‌. ఫార్మాసిటీలో దాదాపు 90 కంపెనీలు ఉన్నాయి. అనకాపల్లి జిల్లా , అచ్యుతాపురం సెజ్ పరిధిలో మరో 208 కంపెనీలు ఉన్నాయి. వైకాపా ప్రభుత్వం కొలువుదీరిన దగ్గర్నుంచి ఇంతవరకు లెక్క చూస్తే తాజా ప్రమాదంతో కలిపి మొత్తం 42 ప్రమాదాలు జరిగాయి. ఈ ఘటనల వల్ల మొత్తం 75 మంది కార్మికుల జీవితాలు గాలిలో కలిసిపోయాయి.
* నిద్రపోతున్న నియంత్రణ విధానాలు…
సాధారణంగా ఓ పారిశ్రామిక సెజ్లో అనేక పరిశ్రమలకు అనుమతి ఇస్తారు. ఆయా పరిశ్రమలలో భద్రతా ఏర్పాట్లు పరిశీలించడానికి, పర్యావరణపరంగా సమస్యలు తలెత్తకుండా తీసుకునే చర్యలను తరచు పరిశీలించడానికి, కార్మికుల రక్షణ విధానాలు సక్రమంగా అమలు జరుగుతున్నాయో లేదో తరచు తనిఖీల ద్వారా క్రమబద్దీకరించడానికి, ఏవైనా ప్రమాదాలు జరిగినప్పుడు తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకునే ఏర్పాట్లు ఉన్నాయో లేదో గమనించడానికి, ప్రమాద కారణాలను సాధ్యమైనంత తొందరగా కనుగొని అప్పటికప్పుడు స్పందించడానికి, ఇకపై ఇలాంటి ప్రమాదాలు తలెత్తకుండా పకడ్పందీగా చెక్లిస్ట్ పద్ధతులను విధించడానికి వివిధ ప్రభుత్వ శాఖల యంత్రాంగం సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుంది. కాలుష్య నియంత్రణ మండలి, డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అధికారుల బృందం, సంబంధిత మంత్రిత్వ శాఖకు చెందిన అధికార బలగం నిరంతర నియంత్రణ విధానాలతో కలిసికట్టుగా వ్యవహరించాల్సి ఉంటుంది. వీరందరిపై పాలకవర్గం నుంచి సంబంధిత మంత్రి, ఆపై ముఖ్యమంత్రి తరచు సమావేశాలు నిర్వహిస్తూ, సూచనలు ఇస్తూ పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది. అయితే నిర్లక్ష్యం నిలువునా పేరుకుపోయిన జగన్ ప్రభుత్వంలో ఈ వ్యవస్థలన్నీ పెను నిద్రలో జోగుతున్నాయనడానికి రాంబిల్లి పరిశ్రమలో అగ్నిప్రమాదం లాంటి దుర్ఘటనలు దర్పణం పడుతుంటాయి.
* ఎన్ని పీడకలలో…!
ఒకసారి ఒక పొరపాటు జరిగితే అది పునరావృతం కాకుండా పటిష్టమైన పద్ధతులను ఏర్పాటు చేసుకోవాలనేది జగమెరిగిన సూత్రం. అయితే దురదృష్టవశాత్తు ఇలాంటి పనితీరే జగన్ ప్రభుత్వంలో కొరవడింది. ఒక్కసారి రెండేళ్ల వెనక్కి వెళితే… విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీలో 2020 మే 7న స్టైరీన్ రసాయనం నుంచి వెలువడిన ఆవిర్ల కారణంగా 12 మంది మృత్యువాత పడిన దారుణ ఘట్టం అందరినీ ఉలిక్కిపడేలా చేస్తుంది. వందలాది మంది అస్వస్థతకు గురయ్యారు. అప్పట్లో కూడా అనేక మంది కార్మికులు, ప్రజలు సైతం రోడ్ల మీద ఎక్కడికక్కడ పడిపోవడం తీవ్ర భయాందోళనలకు దారి తీసింది. ఆ నేపథ్యంలో ఓ కమిటీ వేసి పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలపై సిఫార్సులు చేశారు. అయితే ఆయా సిఫార్సులను పరిశ్రమల వాళ్లు పాటిస్తున్నారా, లేదా అనే నిరంతర పర్యవేక్షణ కొరవడడంతో కార్మికుల భద్రత ప్రశ్నార్థకమవుతోంది. అప్పట్లోనే అధికారులు హడావుడి చేసి విశాఖలో ప్రమాదకరమైన పరిశ్రమలు 267 ఉన్నాయని గుర్తించారు. వాటిపై తనిఖీలు చేసి 121 సంస్థల్లో లోపాలనున్నట్టు గ్రహించి నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకున్నారు. సాధారణంగా ప్రతి పరిశ్రమపైన చట్ట ప్రకారం సేఫ్టీ ఆడిట్లను నిర్వహించాలి. అయితే ఈ ఆడిట్లు ప్రభుత్వ పరంగా కాకుండా ప్రైవేటు సంస్థలే చేస్తుండడంతో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.
ఇలాంటి విధాన పరమైన లోపాలతో తరచు ప్రమాదాలు జరుగుతూ అవి పీడకలల్లాంటి జ్క్షాపకాలను ప్రోది చేస్తున్నాయి.
* గతేడాది డిసెంబర్‌లో పరవాడ జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మాసిటీ లారస్‌ ల్యాబ్‌లో ఓ బ్లాక్‌లో మంటలు చెలరేగి అయిదుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.
* ఈ ఏడాది జనవరి 31న జీఎంఎఫ్‌సీ ల్యాబ్‌లో బాయిలర్‌ పేలి ఒకరు మృత్యువాత పడ్డారు.
* కబిజిత్‌ ఫెర్రో ఎల్లాయిస్‌ పరిశ్రమలో ఒకరు మృది చెందగా, ఆంజనేయ ఎల్లాయిస్‌ మిథాన్‌ ఫెర్రోస్‌లో విస్ఫోటం రెండు ప్రాణాలను బలిగొంది. 8 మందికి గాయాలయ్యాయి.
* బ్రాండిక్స్‌ సెవరల్‌ ఇండియా పరిధిలోని సీడ్స్‌ దుస్తుల పరిశ్రమలో గతేడాది జూన్‌, ఆగస్టులో రెండు సార్లు విషవాయువులు కమ్మేశాయి. ఈ ప్రమాదాల్లో 539 మంది మహిళలు అస్వస్థతకు గురవడం కలకలం రేపింది..
* 2019లో స్మైలెక్స్ ల్యాబొరేటరీస్ లో ఇద్దరు చనిపోగా, విజయశ్రీ ఆర్గానిక్స్ ప్రమాదంలో ఒకరు మరణించారు.
* 2020లో ఫార్మాసిటీలోని విశాఖ సాల్వెంట్స్‌ సంస్థలో ఇద్దరు తుది శ్వాస విడిచారు. గాఢమైన రసాయన వాసనలు వ్యాపించడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు.
* సాయినార్ ఫార్మాలో 2020లో ఇద్దరు కన్నుమూశారు.
* 2022లో రాంకీ పంప్ హౌస్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
ఇప్పుడు తాజాగా రాంబిల్లి సాహితీ ఫార్మా కంపెనీలో ప్రమాదం మరోసారి ప్రభుత్వ పరమైన, పాలనా పరమైన నిర్లక్ష్యాన్ని, వైఫల్యాన్ని ఎండగట్టింది.
సాధారణంగా పరిశ్రమల్లో అనేక లోపాలు, లోటుపాట్లు కాలక్రమేణా పేరుకుపోతుంటాయి. దశాబ్దాల నాటి పాత యంత్రాలనే వాడుతుంటారు. ఆధునిక యంత్రాలను కొనుగోలు చేయడంలో ఆసక్తి చూపించరు. పెరుగుతున్న సాంకేతిక ప్రయోజనాలను అందుకోవడంలో కూడా ఉదాసీనత చూపిస్తుంటారు. ప్రమాదాల సమయంలో హెచ్చరించే ఆధునిక ఆటోమేషన్ వ్యవస్థను అనుసంధానించుకోరు. వివిధ రసాయనాలను నిల్వ చేయడంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోరు. ఎక్కువ వేతనాలు ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశంతో కొన్ని యంత్రాలు, వ్యవస్థల వద్ద నిపుణులను, అర్హులను కాకుండా మామూలు పనివాళ్లను తీసుకుంటూ ఉంటారు.
ఇన్ని లోపాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, పరిశీలిస్తూ, తనిఖీలు చేస్తూ నియంత్రించాల్సిన అధికారులు, పాలకులు అంతులేని నిర్లక్ష్యం వహించడం వల్ల తరచు ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు అనుక్షణం పెరిగిపోతున్నాయి.