స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్.. ఎన్నికలు ఆపాలంటూ కోర్టుకు ప్రభుత్వం

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడంపై ఏపీ సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కరోనా వ్యాక్సినేషన్‌కు సిద్ధమవుతున్న సమయంలో… షెడ్యూల్ ఇవ్వడం ఏంటని మండిపడుతోంది. ఎన్నికలు ఆపాలంటూ ఈ రోజు కోర్టుకు వెళ్లేందుకు కూడా ఏపీ సర్కారు సమాయత్తమైంది. కోర్ట్ కు సెలవులు ఉన్న నేపథ్యంలో హౌస్ మోషన్ మూవ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా లేమని చెప్పినా.. రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ దూరహంకాపురితంగా వ్యవహరిస్తున్నారని జగన్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. దీంతో బాల్ హైకోర్టుకు చేరినట్లైంది.

మరోవైపు..ఏపీ చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కమిటీ.. సాయంత్రం ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌తో భేటీ అయింది. ఎన్నికల ప్రక్రియపై చర్చించింది. కోవిడ్ 19 వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టబోతున్నామని, ప్రస్తుత సమయంలో పంచాయతీ ఎన్నికలు సాధ్యం కాదని అధికారుల బృందం ఎస్ఈసీకి స్పష్టం చేసింది. అయితే.. అధికారులతో చర్చించిన వెంటనే నిమ్మగడ్డ రమేష్ కుమార్ కార్యాలయం పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ చేయడం గమనార్హం.