రైతన్నల ఉద్యమానికి మహాత్మాగాంధీ మనవరాలు సంఘీ భావం

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలను చేపడుతున్న రైతు ఉద్యమానికి పెద్ద యెత్తున మద్దతు లభిస్తుంది. సామాజిక కార్యకర్తలు, ప్రముఖులు, పార్టీలు భారీగా సంఘీభావం తెలుపుతున్నాయి. తాజాగా జాతిపిత మహాత్మాగాంధీ మనవరాలు తారాగాంధీ భట్టాచార్జీ (84) కూడా ఢిల్లీ సరిహద్దుల్లోని ఘాజిపూర్‌ను సందర్శించి..ఈ ఉద్యమానికి మద్దతు తెలిపారు. నేషనల్‌ గాంధీ మ్యూజియం చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్న ఆమె…అక్కడకు చేరుకుని శాంతియుత నిరసనలు చేపట్టాలని అన్నదాతలకు సూచించారు. అదేవిధంగా వ్యవసాయ వర్గాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని కేంద్రానికి హితవు పలికారు. ఏ రాజకీయ కార్యక్రమంలో భాగంగా తాము ఇక్కడకు రాలేదని , మనం జీవించేందుకు ఆహారాన్ని అందిస్తున్న రైతుల కోసం ఇక్కడకు వచ్చామంటూ ఆమె వ్యాఖ్యానించారు. మేము మీ వల్లే ఇక్కడ ఉన్నామని, రైతులు బాగుంటేనే తాము, సమాజం బాగుంటుందని అన్నారు.

అదేవిధంగా బ్రిటీష్‌ చెర నుండి భారత్‌ స్వాతంత్య్రం పొందేందుకు తొలి పోరాటం కూడా 1857లో ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌ నుండే ప్రారంభమైందని గుర్తు చేసుకున్నారు. రైతులకు మద్దతు నిలిచేందుకు తాను ఇక్కడకు వచ్చానని ఆమె పేర్కొన్నట్లు భారత కిసాన్‌ యూనియన్‌ మీడియా ఇన్‌చార్జ్‌ ధర్మేంద్ర మాలిక్‌ ప్రకటన విడుదల చేశారు. కేంద్రం ఏదైనా చేయనీ..కాని అందులో రైతులకు ప్రయోజనం ఉండాలని, అన్నదాతలు ఎంతో కృషి చేస్తారని అన్నారు. రైతు ప్రయోజనం వెనుక దేశ ప్రయోజనం ఉందంటూ తారా గాంధీ వ్యాఖ్యానించారు.