హాత్రస్ కేసులో మరో ట్విస్ట్ ఇచ్చిన ప్రధాన నిందితుడు

ఉత్తరప్రదేశ్‌లో సంచలనం రేపిన హాథ్రస్‌ బాలిక మరణం కేసు రోజుకో మలుపు తిరుగుతున్నది. 19 ఏండ్ల దళిత బాలికను అగ్రవర్గాలకు చెందిన యువకులు సెప్టెంబర్‌ 14న సామూహిక లైంగిక దాడి చేసినట్లు బాధిత కుటుంబం ఆరోపిస్తున్నది. నాలుక తెగడంతోపాటు తీవ్రంగా గాయపడిన ఆమె గత నెల 29న ఢిల్లీ మరణించడంతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. మరోవైపు పోలీసులు, అగ్రవర్గాల వారు బాలిక కుటుంబానిదే తప్పు అన్నట్లుగా చెబుతున్నారు.

హాత్రస్ గ్యాంగ్ రేప్ కేసులో ప్రధాన నిందితుడైన సందీప్ సింగ్ ఠాకూర్, సహ నిందితులైన రాము, లవ్ కుష్, రవిలు ప్రస్తుతం రిమాండ్ ఖైదీలుగా అలీగఢ్ జైలులో ఉన్నారు. ప్రభుత్వ, పోలీసుల తీరు అనుకూలంగా ఉండటంతో తమ వంతు ప్రయత్నంగా ఆ నలుగురూ గురువారం జైలు సూపరింటెండెంట్ కు లేఖ రాశారు. గ్యాంగ్ రేప్, హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తాము నిర్దోషులమని, కొందరు కావాలనే తమను తప్పుడు కేసులో ఇరికించారని నిందితులు లేఖలో పేర్కొన్నారు. లేఖపై వేలిముద్రలతో సంతకాలు చేసిన నలుగురు నిందితులు.. దాన్ని సిట్ బృందానికి చేర్చాల్సిందిగా జైలు అధికారిని కోరారు.

చనిపోయిన యువతితో తనకు గాఢమైన స్నేహం ఉందని, ఆమెతో తరచూ మాట్లాడేవాడినని ప్రధాన ముద్దాయి సందీప్ సింగ్ చెప్పుకొచ్చాడు. పైగా బాధిత కుటుంబపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. చనిపోయిన అమ్మాయికి తనకు దగ్గర స్నేహితురాలని, తాము స్నేహంగా ఉండటం అమ్మాయి కుటుంబసభ్యులకు ఇష్టం లేదని చెప్పుకొచ్చాడు.. అందుకే ఆమెను తల్లి, సోదరులు కలిసి తీవ్రంగా కొట్టారని, ఆ గాయాలతోనే ఆమె చనిపోయిందని సందీప్‌ ఠాకూర్‌ అంటున్నాడు. ఆ ఘటన జరిగిన రోజు తాను అమ్మాయిని కలిసిన మాట నిజమే కానీ, ఆమెతో తప్పుగా ప్రవర్తించలేదని చెప్పాడు. అనవసరంగా తమను ఈ కేసులో ఇరికించారని, సమగ్రంగా దర్యాప్తు జరిపితే ఎవరు దోషులో తేలుతుందంటూ హాథ్రస్‌ పోలీసులకు సందీప్‌ ఓ లేఖ కూడా రాశాడు. మేమిద్దరం తరచూ కలుసుకునేవాళ్లమని, ఫోన్‌లో కూడా మాట్లాడుకునేవాళ్లమని సందీప్‌ అన్నాడు.. ఘటన జరిగిన రోజు కూడా ఆమెను కలిసేందుకు పొలం దగ్గరకు వెళ్లానని, అక్కడ వాళ్ల అమ్మ, సోదరులను చూసి వెనక్కి వచ్చేశానని సందీప్‌ చెబుతున్నాడు.

ఆ తర్వాత వాళ్ల అమ్మ, సోదరులు ఆమెను తీవ్రంగా కొట్టినట్టు గ్రామస్తులు చెబితే విన్నానని అంటున్నాడు. స్నేహితురాలిపై తానేప్పుడూ చేయి కూడా చేసుకోలేదని, అలాంటిది ఇంతటి ఘాతుకానికి ఎలా ఒడిగడతానని సందీప్‌ తెలిపాడు. తామంతా అమాయకులమని, ఈ కేసును లోతుగా విచారించాలని లేఖలో ఎస్పీకి విన్నవించుకున్నాడు. హిందీలో రాసిన ఈ లేఖలో నిందితుడి వేలిముద్రలతో పాటు సహ నిందితుల వేలి ముద్రలు కూడా ఉన్నాయి..