అమెరికా అధ్యక్షుడితో మోదీ ఫోన్‌ సంభాషణ!

న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్‌తో సతమతమవుతున్న ఇండియాకు సాయం చేయడానికి ముందుకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో మాట్లాడారు. ఇండియాలో కొవిషీల్డ్ వ్యాక్సిన్ తయారీకి అవసరమైన ముడి పదార్థాలను సరఫరా చేస్తామని అమెరికా ప్రకటించిన మరుసటి రోజే ఈ ఇద్దరు దేశాధినేతలు చర్చలు జరపడం గమనార్హం. ఈ ఫోన్ చర్చల సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు తాను కృతజ్ఞతలు తెలిపినట్లు మోదీ ట్వీట్ చేశారు.

ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ జో బైడెన్‌తో సంభాషణ ఫలవంతంగా సాగింది. రెండు దేశాల్లో కరోనా పరిస్థితులపై చర్చించాము. ఈ సందర్భంగా ఇండియాకు అమెరికా అందించిన సాయానికి అధ్యక్షుడు బైడెన్‌కు కృతజ్ఞతలు తెలిపాను అని మోదీ ట్వీట్ చేశారు.

కరోనా కట్టడిలో కీలకమైన ఔషధాలతోపాటు వెంటిలేటర్లు, కొవిషీల్డ్ తయారీకి కావాల్సిన ముడి పదార్థాలను అందించనున్నట్లు ప్రధాన మంత్రి కార్యాలయం వెల్లడించింది. కరోనా సెకండ్ వేవ్‌ను కట్టడి చేయడానికి వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయడంతోపాటు మందులు, ఇతర పరికరాల సరఫరాపై ఇరు దేశాధినేతలు చర్చించినట్లు పీఎంవో ఒక ప్రకటనలో తెలిపింది.

అటు వైట్‌హౌజ్ కూడా ఇద్దరి ఫోన్ సంభాషణ తర్వాత ప్రకటన విడుదల చేసింది. ఇండియాకు అన్ని విధాలుగా అండగా ఉంటామని బైడెన్ మాట ఇచ్చారని, అందులో భాగంగానే ఆక్సిజన్ సంబంధిత పరికరాలు, వ్యాక్సిన్ పదార్థాలు, ఇతర ఔషధాలను అత్యవసరంగా ఇండియాకు పంపిస్తున్నట్లు వైట్‌హౌజ్ ఆ ప్రకటనలో వెల్లడించింది. అయితే అమెరికాలో అవసరానికి మించి ఉన్న 3 కోట్ల ఆస్ట్రాజెనెకా (కొవిషీల్డ్‌) వ్యాక్సిన్ డోసుల గురించి మాత్రం ఏమీ చెప్పలేదు.