ఇప్పుడు కావాల్సింది ఇంటర్నెట్, మేకలు, గొర్రెలు కాదు.. ఆక్సిజన్, అత్యవసర ఔషధాలు: పవన్ కల్యాణ్

కరోనా విజృంభిస్తున్న వేళ ఆక్సిజన్, అత్యవసర ఔషధాల కొరతపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకింత నిర్లిప్తత అని జనసేనాని పవన్ కల్యాణ్ విమర్శించారు. విజయనగరం మహారాజా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక కరోనా బాధితులు మృతి చెందడం, విశాఖపట్నం ఆసుపత్రిలో బెడ్స్ లేక రోగులు మరణించడం వంటి దురదృష్టకర ఘటనల గురించి తెలుసుకుంటే మనసు వికలం అవుతోందని పేర్కొన్నారు.

ప్రజలు ప్రాణవాయువు, ఔషధాలు అందక ఊపిరి వదిలేస్తున్నారని… కరోనా మృతుల లెక్కలు దాయగలరేమో కానీ, బాధిత కుటుంబాల కన్నీటిని అడ్డుకోగలరా? అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ప్రతి 20 నిమిషాలకు ఒకరు కరోనాతో చనిపోతున్నారని అధికారిక గణాంకాలు చెబుతున్నాయని, అంతకంటే ఎక్కువమందే చనిపోతున్నారని క్షేత్రస్థాయి సమాచారం చెబుతోందని వివరించారు. రాష్ట్రంలో ఆక్సిజన్ అందక ప్రాణాలు పోతున్నాయని ఆరోపించారు. అత్యవసర ఔషధం రెమ్ డెసివిర్ బ్లాక్ మార్కెట్లో లక్షల రూపాయలకు అమ్ముతున్నారని మండిపడ్డారు. మార్కెట్లో ఒక్కో ఇంజెక్షన్ రూ.40 వేలకు అమ్మితే సామాన్యులు, పేదలు తమ ప్రాణాలను ఎలా కాపాడుకోగలరని నిలదీశారు.

ఓవైపు కరోనా విలయతాండవం చేస్తుంటే మరోవైపు ఇంటింటికీ ఇంటర్నెట్ ఇవ్వడం గురించి, మహిళలకు మేకలు, గొర్రెలు ఇవ్వడం గురించి ప్రభుత్వం దృష్టి పెడుతోందని విమర్శించారు. ఇప్పుడు ఇంటింటికీ కావాల్సింది ఇంటర్నెట్, మేకలు, గొర్రెలు కాదని… ఆక్సిజన్, అత్యవసర ఔషధాలు అని పవన్ హితవు పలికారు. మన రాష్ట్రం మరో రోమ్ కాదని, మన పాలకులు నీరో వారసులు కారాదని నిరూపించాల్సిన తరుణం ఇదని పేర్కొన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో పది, ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రద్దు చేయాలని పవన్ డిమాండ్ చేశారు. తద్వారా విద్యార్థులను, వారి కుటుంబాలను కరోనా బారి నుంచి కాపాడవచ్చని తెలిపారు.