గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్‌ను ఆవిష్కరించిన మోదీ

పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్‌ను ఇవాళ ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాబోయే 25 ఏళ్ల కోసం ఫౌండేషన్ వేస్తున్నట్లు ప్రధాని తెలిపారు. జాతీయ మాస్టర్ ప్లాన్ విధానంతో 21వ శతాబ్ధపు అభివృద్ధి ప్రణాళికలకు గతిశక్తి లభిస్తుందని ఆయన వెల్లడించారు. ఈ విధానం ద్వారా అభివృద్ధి పనులు నిర్ణీత సమయంలో ముగుస్తాయన్నారు. గతంలో ఎక్కడకు వెళ్లినా వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అన్న బోర్డులు కనిపించేవని, ఆ బోర్డులను చూసి ఈ పనులు ఎన్నడూ ముగియవని ప్రజలు అనుకునేవారని, ప్రజల్లో అపనమ్మకం పెరిగేదని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిందన్నారు. ప్రణాళికలను పకడ్బందీగా రూపొందించామని, అభివృద్ధి పనుల్లో గతిని తీసుకువచ్చినట్లు ప్రధాని మోదీ తెలిపారు. రాజకీయ పార్టీలు గతంలో ఎన్నడూ మౌళిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టిపెట్టలేదన్నారు. ఆ పార్టీల మ్యానిఫెస్టోల్లో అవి ఉండేదికాదన్నారు. సుస్థిరమైన అభివృద్ధి సాధించాలన్నా.. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలన్నా.. ఉద్యోగ కల్పన చేయాలన్నా.. నాణ్యమైన మౌళిక సదుపాయాలు అవసరమని మోదీ అన్నారు. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఎగ్జిబిషన్ కాంప్లెక్స్ కొత్త మోడల్‌ను కూడా ప్రధాని సమీక్షించారు.

గతిశక్తి ప్రణాళికలో సుమారు 107 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు దేశ స్వరూపాన్ని మార్చనున్నాయి. జాతీయ రహదారుల్ని బలోపేతం చేసేందుకు సుమారు రెండు లక్షల కిలోమీటర్ల మేర ఇంటిగ్రేటెడ్ నెట్వర్క్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. రైల్వేల ద్వారా 1600 మిలియన్ టన్నుల కార్గోను తరలించనున్నారు. 35వేల కిలోమీటర్ల విస్తీర్ణంలో గ్యాస్ పైప్‌లైన్ కనెక్టివిటీ పెంచనున్నారు. రానున్న అయిదేళ్లలో కొత్తగా 220 విమానాశ్రయాలను నిర్మించనున్నారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా 25వేల ఎకరాల విస్తీర్ణంలో 11 పారిశ్రామిక వాడలను అభివృద్ధిపరచనున్నారు. సైనిక దళాలను బలోపేతం చేసేందుకు 1.7 లక్షల కోట్ల విలువైన రక్షణ ఉత్పత్తులను తయారు చేయనున్నారు. 38 ఎలక్ట్రానిక్ తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఆరోగ్యవ్యవస్థను పటిష్టం చేసేందుకు 109 ఫార్మా క్లస్టర్లను ఓపెన్ చేయనున్నారు.