భావజాలాలు ఎన్ని ఉన్నా మానవత్వాన్ని మరవద్దు

*మనందరినీ ఒక చోట చేర్చేది భారతీయతే
*కలలు కనండి….వాటి సాకారానికి కష్టపడండి
*సమస్యల నుంచి ఎన్నడూ పారిపోవద్దు
*వరంగల్‌ ఎన్‌ఐటీ క్యాంపస్‌లో శ్రీ పవన్‌ కళ్యాణ్‌

– కాలేజి క్యాంపస్‌లో ఎన్ని రాజకీయ భావజాలాలు ఉన్నా మానవత్వాన్ని ఎన్నడూ మరచిపోవద్దు..
– దేశంలో ఎన్నో భాషలు, సంప్రదాయాలు ఉన్నా..భారతీయత మనల్ని అందరినీ ఒక దగ్గరికి చేర్చుతోంది.
– ఆర్ట్స్‌, సైన్స్‌ సబ్జెక్టులను కలిపి చదవండి.. వాటిలో పేర్కొన్న విధంగా కొత్త అంశాల పరిశోధనలను ఎన్నడూ ఆపొద్దు.
– వివిధ రకాల పుస్తకాలను చదవడం ద్వారా మన మనస్సును ఉత్తేజంతో నింపవచ్చు అని తెలుసుకోండి.
– అలాగే.. చదువు, తెలివితేటలతో పాటు యువత శారీరకంగా పుష్టిగా ఉండాలి
– నేను అసలు ఈ యూనివర్శిటీకి ఆహ్వానించబడటానికి అర్హుడినేనా అని ప్రశ్నించుకొన్నాను.. నేను మీకు ఎటువంటి బోధనలు చేసేందుకు ఇక్కడకు రాలేదు. నా జీవితంలో జరిగిన కొన్ని అనుభవాలను మీతో షేర్‌ చేసుకోవాలనుకొన్నాను.
– ఈ ఎన్.ఐ.టి. సంస్థను పండిట్‌ జవహర్‌ లాల్‌ నెహ్రూ ఆరు శతాబ్దాల కింద ప్రారంభించారు. ఈ రోజు మీరు ఏడు రోజుల స్ప్రింగ్‌ స్ప్రీ ఉత్సవాలను జరుపుకొంటున్నారంటే అ సంస్థ వెనక ఎందరి కృషి ఉందో గమనించండి.
మన జీవితాలలో అభివృద్ధి కావాలంటే సైన్స్‌, టెక్నాలజీ అవసరం చాలా ఉంది. అలాగే కళలు కూడా అంతే అవసరం. ఉదా: నాటు నాటు పాట ఆస్కార్‌ సాధించిపెట్టిందని గుర్తుంచుకోవాలి.
కళలు అనే ప్రక్రియ ప్రజలందరినీ ఒక బాటలోకి తీసుకువస్తుందని గమనించాలి.
అలాగే మానవత్వం మనిషి జీవితానికి చాలా ముఖ్యం..
నాకు చిన్నతనం నుంచి పుస్తకాలు చదవడం అలవాటు.
థౌజండ్‌ గ్రేట్‌ లైవ్స్‌ అనే పుస్తకం నన్ను చాలా ఆకర్షించింది.
నేను ఎన్నడూ సమస్యల నుంచి పారిపోలేదు. ఈ రోజు నేను గెలవకపోవచ్చు.. కానీ రేపు తప్పకుండా సాధిస్తాను.
మీరు కూడా కలలు కనండి దానివల్ల వచ్చే నష్టం ఏమీ లేదు
వాటిని సాధించడానికి కష్టపడండి… మీరు ఏమి సాధించదల్చుకొన్నారో వదిలేయండి.. ప్రతీ అంశాన్ని మీకు అనుకూలంగా మార్చుకోండి.
నాకు కూడా 5 ఏళ్ల ప్రణాళిక, 10 ఏళ్ల ప్రణాళిక, 20 ఏళ్ల ప్రణాళికలు ఉన్నాయి. నేను విజయాన్ని సాధించినా… సాధించకపోయినా నా ప్రయత్నాన్ని ఎట్టి పరిస్థితుల్లోను వదలను.
అలాగే ప్రతీ వ్యక్తికి మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌ చాలా అవసరం
మీరు లీగల్‌గా కరెక్ట్‌ కావచ్చు… కానీ.. నీతిపరంగా కరెక్ట్‌ కాకపోవచ్చు.
కాబట్టి.. ప్రతీ అంశాన్ని మీరు డిఫరెంట్‌ కోణాల్లో పరిశీలించాల్సిన అవసరం ఉంది.
మహాత్మా గాంధీ అనుసరించిన మార్గానే నేనూ అనుసరించాను.
కాపీ కొట్టి పరీక్ష పాసయ్యే కంటే.. తప్పు చేయకుండా ఫెయిల్‌ అవడమే మేలని తెలుసుకోవాలి.
జీవితంలో ప్రతీ దానికి షార్ట్‌కట్‌ పద్ధతులు పాటించకూడదు
నేనిచ్చే సూచన ఏంటంటే… కష్టాలను ధైర్యంగా ఎదుర్కోండి.. షార్ట్‌కట్‌ పధ్దతులను పాటించవద్దు. షార్ట్‌కట్‌ పధ్ధతుల ద్వారా మీకు తక్షణం లాభం చేకూరవచ్చు.. కానీ మిమ్మల్ని మీరు మంచి వ్యక్తిగా మలుచుకోవాలంటే కష్టాలు.. ఇబ్బందులను అధిగమించాల్సిందేనని గుర్తుంచుకోండి.
యాపిల్‌ కంపెనీ తయారు చేసే ఉత్పత్తులను మన భారత దేశంలో కేవలం 5 శాతం మంది ప్రజలే కొనగలుగుతారు.. అదే ప్రపంచ స్థాయిలో ఇది 2-3 శాతం మాత్రమే… కాబట్టి మీ యెక్క వ్యాపార దక్షతను స్టీవ్‌ జాబ్స్‌లా ఉపయోగించవద్దని కోరుకుంటున్నాను.
ఎక్కువ సంఖ్యలో ప్రజలకు ఉపయోగపడేలా మీ ప్రయోగాలు ఉండాలని గుర్తుంచుకోండి.
డా. దిలీప్‌ మహాలానాబిస్‌ జీవితం గురించి తెలుసుకోండి..
1971లో బంగ్లాదేశ్ లిబరేషన్‌ సమయంలో కలరా సోకి లక్షల మంది చావుకు దగ్గర పడుతుంటే.. ఆయన ఓఆర్‌ఎస్‌ థెరపీని అమలుపరిచి లక్షల మందిని కాపాడారు. ఆయన ఆ ఫార్ములాకు కనీసం పేటెంట్‌ కూడా తీసుకోకుండా చరిత్రలో నిలిచారు. ఆయన గతేడాది 87 ఏళ్ల వయసులో మరణించారు. అటువంటి ప్రయోగాలు మానవాళికి అవసరం..
కాబట్టి మీరు కూడా కొత్త కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టండి.. కొత్త ప్రయోగాలు మానవ జీవితంలో వ్యత్యాసాలను రూపుమాపుతాయి.
మీ జీవితంలో ఉన్న అసలైన హీరోలను గుర్తించండి.. వారు మీ తల్లిదండ్రులు కావచ్చు లేదా… మీ ఎన్.ఐ.టి. అభివృద్ధికి కృషి చేసిన ఏ మహాభావులైనా కావచ్చు.. లేదా నన్ను మీ విద్యాలయానికి ఆహ్వానించిన డీన్లు, ప్రోఫెసర్లు కూడా కావచ్చు.
అలాగే.. మహాకవులైన దాశరథి, శ్రీశ్రీ లాంటి వారు మన ప్రజలలో వారి కవితల ద్వారా చైతన్యాన్ని రగిలించారు.
నేను 5-7 సినిమాలు చేసిన తర్వాత న్యూజీలాండ్‌ వలస పోవాలని అనుకున్నాను. కానీ ఖుషీ సినిమా చేసిన తర్వాత నా నిర్ణయాన్ని మార్చుకొన్నాను. ఎన్నో అవాంతరాలు.. కష్టాలు వస్తాయి.. మన సమాజంలోని వ్యక్తులు మనను ఇబ్బందులకు గురిచేస్తారు.
తర్వాత నా వంతు బాధ్యతగా సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించుకొన్నాను. నా అభివృధ్దికి నా తల్లిదండ్రులు, ఇంకా ఎందరో నాకు సహకరించారు.
నాకు డబ్బు మీద కానీ సినిమాల మీద కానీ.. ఖ్యాతి పట్ల కానీ ఆశ లేదు. నేను నా దేశానికి నాకు సాధ్యమైనంత సేవ చేయాలని భావించాను. అందులో భాగంగానే నల్గొండ ప్లోరైడ్‌ బాధితులకు, అలాగే ఆదిలాబాద్‌ తండా ప్రజలకు నాకు చాతనైంత సాయం చేయగలిగాను. దేశం నాకు ఇచ్చింది తిరిగి దేశానికి ఇవ్వాలని నిర్ణయించాను.