అమెరికాలో మొదలైన పోలింగ్

అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మన దేశ కాలమాన ప్రకారం.. మధ్యాహ్నం 1 గంటలకు ఓటింగ్‌ ప్రక్రియ మొదలైంది. అమెరికాలోని న్యూ హాంప్‌షైర్‌లో తొలి ఓటు నమోదైంది. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో పలు జాగ్రత్తల నడుమ పోలింగ్‌ కొనసాగుతోంది. అగ్రరాజ్యంలో మొత్తం 23.9 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పటికే ముందస్తు ఓటింగ్‌లో సగం ఓట్లు పోలయ్యాయి. దాదాపు 10 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. హవాయ్‌, టెక్సాస్‌, మోంటానా రాష్ట్రాల్లో భారీగా ముందస్తు ఓట్లు పోలయ్యాయి. ఈ పోస్టల్‌ ఓట్లపై రిపబ్లిక్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్ర అసంతృప్తి, అనుమానం వ్యక్తం చేశారు.

మరోవైపు ఎన్నికల్లో రిగ్గింగ్‌ జరుగుతోందని ట్రంప్ ఆరోపించారు. ముందస్తు ఓటింగ్‌ భారీగా జరగడంతో విజయంపై డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి బైడెన్‌ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే అమెరికా ప్రజల నాడి ఎలా ఉంటుందనే అంశంపై ప్రపంచం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిగా, మాజీ ఉపాధ్యక్షుడు డెమొక్రాటిక్‌ అభ్యర్థిగా జో బైడెన్‌ బరిలో నిలిచారు.