మున్సిపాలిటీ పాలన గాడిలో పెట్టండి.. జనసేన వినతిపత్రం

  • మున్సిపల్ అధికారుల రుబాబుకు అడ్డుకట్ట వేయాలి
  • బురద నీటి సరఫరాతో ప్రజలకు రోగాలు
  • అప్పుడప్పుడు ఇస్తున్న కొళాయిలు అంతంత మాత్రంగా నీరు
  • వివేకానంద కాలనీ మురుగు కాలువల్లో మురుగు తొలగించాలి
  • పట్టణ మెయిన్ రోడ్డులో కాలువలు నిర్మాణం చేయాలి
  • వరహాలు గడ్డలో పూడిక తీత పనులు చేపట్టండి
  • అధికారులు అందుబాటులో లేక
  • తురుమళ్ళ రామమూర్తి విగ్రహానికి వినతిపత్రం అందజేసిన జనసేన పార్టీ నాయకులు

పార్వతీపురం మున్సిపాలిటీ పాలన గాడిలో పెట్టాలని జనసేన పార్టీ నాయకులు కోరారు. మంగళవారం జనసేన పార్టీ జిల్లా నాయకులు వంగల దాలినాయుడు, రాజాన రాంబాబు, మండల శరత్ కుమార్, అన్నాబత్తుల దుర్గాప్రసాద్, తెర్లి సంతు, వై నవీన్, టీ వంశీ, రైతు బాలాజీ నాయుడు తదితరులు కోరారు. పార్వతీపురం మున్సిపాలిటీ సమస్యల పరిష్కారం చేయాలని అధికారులను కోరేందుకు మున్సిపల్ కార్యాలయానికి రాగా, మున్సిపల్ కమిషనర్, మేనేజర్, చైర్పర్సన్ ఎవరూ లేకపోవడంతో మాజీ మున్సిపల్ చైర్మన్ స్వర్గీయ తురుమళ్ళ రామమూర్తి విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ పార్వతీపురం మున్సిపాలిటీ పాలన గాడి తప్పిందని ఆరోపించారు. వర్షా కాలమే కాకుండా, వేసవి కాలంలో కూడా కుళాయిల్లో బురద నీరు సరఫరా చేసి ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్నారన్నారు. అలాగే అప్పుడప్పుడు ఇస్తున్న కుళాయిల్లో అంతంతమాత్రంగానే నీరు ఇస్తున్నారన్నారు. వేసవి కావడంతో ప్రజలు తాగునీటికీ కటకటలాడుతున్నారన్నారు. అలాగే నాలుగో వార్డులోని వివేకానంద కాలనీలో ఉజ్జిడి తల్లి, దేశమ్మ తల్లి వీధుల్లో మురుగు కాలువల్లో గత కొంతకాలంగా మురుగు తీత పనులు చేపట్టకపోవడంతో దోమలు, ఈగలు, దుర్గంధంతో బాధపడుతున్నట్లు ఆ కాలనీవాసులు తమ దృష్టికి తీసుకువచ్చారన్నారు. అలాగే పట్టణాన్ని వేధిస్తున్న చెత్త డంపింగ్ యార్డ్ సమస్యతో పాటు ఏమాత్రం వర్షం పడిన మెయిన్ రోడ్ లో కాలువలు సక్రమంగా లేక నిల్వ ఉండే నీరు ప్రవహించేందుకు కాలువలు ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. అలాగే వరహాలు గెడ్డలో పూడిక తీత పనులు చేపట్టాలన్నారు. వివేకానంద కాలనీ ఎదురుగా రాయగడ రోడ్డులో తాగునీటి పైపుకు లీకులు ఏర్పడి పెద్ద గొయ్యి ఏర్పడిందని, దానిని పూడ్చాలని పలుమార్లు స్థానికులు కోరినా మున్సిపల్ అధికారులు స్పందించలేదన్నారు. అలాగే మున్సిపాలిటీలోని కొంతమంది అధికారులు రుబాబు చేలాయిస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ప్రజలు తమ వద్ద ఆవేదన వ్యక్తం చేశారన్నారు. వాటిని అరికట్టాలని, ఆయా సమస్యలపై చర్చించేందుకు కార్యాలయానికి వస్తే అధికారులు, పాలకులు లేకపోవడంతో స్వర్గీయ మాజీ చైర్మన్ తురుమళ్ల రామమూర్తి విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. సంబంధిత మున్సిపల్ యంత్రాంగానికి మంచి బుద్ధిని ప్రసాదించి ప్రజలకు చక్కని పాలన అందేలా చూడాలని కోరారు. నాటి పాలన నేడు అందేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసైనికులు పాల్గొని సమస్యలు పరిష్కరించాలని కోరారు.