ఆర్‌ఎల్‌డీ అధినేత అజిత్‌ సింగ్‌ కన్నుమూత

కరోనా బారిన పడి మరణిస్తున్న ప్రముఖుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా.. రాష్ట్రీయ లోక్‌ దళ్‌(ఆర్‌ఎల్‌డీ) అధినేత, కేంద్ర మాజీ మంత్రి అజిత్‌సింగ్‌(82) కన్నుమూశారు. గత నెల 20న కరోనా బారిన పడిన ఈయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మాజీ ప్రధాని చరణ్‌సింగ్‌ కుమారుడైన అజిత్‌సింగ్‌ రాజ్యసభ, లోక్‌సభ సభ్యుడిగానూ పని చేశారు. యూపీఏ హయాంలో పౌర విమానయాన మంత్రిగా అజిత్‌ సింగ్‌ బాధ్యతలు నిర్వర్తించారు. 1939 ఫిబ్రవరి 12న ఉత్తరప్రదేశ్‌లోని మేరఠ్‌లో అజిత్‌సింగ్‌ జన్మించారు.

అజిత్‌ సింగ్‌ మృతిపై ప్రముఖుల సంతాపం

అజిత్‌ సింగ్‌ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. రైతు ప్రయోజనాల కోసం అంకితభావంతో పని చేశారని కొనియాడారు. కేంద్రంలో పలు విభాగాల బాధ్యతలను సమర్థంగా నిర్వహించారని మోదీ అన్నారు.

ఆర్‌ఎల్‌డీ అధినేత మృతి చెందడంపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ సంతాపం ప్రకటించారు. చరణ్‌సింగ్‌ వారసత్వాన్ని సమర్థంగా కొనసాగించారని కొనియాడారు. రైతు నేతగా రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అజిత్‌ సింగ్‌ మద్దతు తెలిపారని సీఎం గుర్తు చేసుకున్నారు. కేసీఆర్‌తో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు కూడా అజిత్‌ సింగ్‌ మృతి పట్ల సంతాపం తెలిపారు.

అజిత్‌సింగ్‌ మృతి పట్ల తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు కూడా సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. పార్లమెంట్‌ సభ్యుడు, కేంద్రమంత్రిగా ఎనలేని సేవలందించారని కొనియాడారు. అజిత్‌సింగ్‌ సంస్కరణలు రైతులకు చాలా ఉపయోగపడ్డాయన్నారు. సామాజిక, ఆర్థిక సమానత్వానికి అజిత్‌సింగ్‌ కృషి అజరామరం అని చంద్రబాబు తెలిపారు.