వైరల్‌ గా మారిన ఆటోడ్రైవర్‌ కథ .. రూ. 24 లక్షల విరాళాలు పంపిన నెటిజన్లు

ముంబయి: తన మనవరాలి చదువు కోసం ఇంటిని అమ్మిన ముంబయి ఆటో డ్రైవర్‌ కథను చదివిన పలువురు నెటిజన్లు ఆయనకు విరాళాలు పంపారు. ఈ విధంగా వచ్చిన విరాళాలు ఏకంగా రూ. 24 లక్షలకి చేరాయి. హృదయవిదారకమైన దేశ్‌రాజ్‌ కథను ‘హ్యూమన్స్‌ ఆఫ్‌ బాంబే’ అనే పోర్టల్‌లో సోషల్‌మీడియాలో షేర్‌ చేశారు. అనంతరం దేశ్‌ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన ఇద్దరు కుమారులు మరణించడంతో కుటుంబపోషణను తన భుజాలపై వేసుకున్నానని అన్నారు. ఇద్దరు కోడళ్లతో పాటు వారి నలుగురు సంతానాన్ని పోషించాల్సిన బాధ్యత తనదేనని అన్నారు. ఆటోరిక్షా మీద వచ్చే ఆదాయంతో నెట్టుకొస్తున్నట్లు చెప్పారు. తన సంపాదనలో అధిక భాగం తన మనవరాళ్ల విద్య కోసం ఖర్చు చేస్తానని ఆనందంగా చెప్పారు. తన మనవరాలు 12 బోర్డ్‌ పరీక్షల్లో 80 శాతం మార్కులతో ఉతీర్ణత సాధించిందని అన్నారు. అయితే తన మనవరాలు బిఇడి చదివేందుకు ఢిల్లీ వెళ్లాలని కోరుకుందని, అందుకోసం తన ఇంటిని విక్రయించానని అన్నారు. ఎలాగైనా మనవరాలి కల తీరాలని.. అందుకోసం ఎంత ఖర్చు అయినా పెడతానని వృద్ధుడైన దేశ్‌ రాజ్‌ చెప్పారు.

ఈ కథ ఆన్‌లైన్‌లో వైరల్‌ అవడంతో పాటు మనవరాలి చదువు కోసం ఆయన పడుతున్న ఆరాటం పలువురి హృదయాలను కదిలించింది. దీంతో విరాళాలు వెల్లువెత్తాయి. అలాగే.. దేశ్‌ రాజ్‌కు సహాయం చేయాలంటూ కాంగ్రెస్‌ నేత అర్చన దాల్మియా, మిలింద్‌ డియోరాలు కూడా రీట్వీట్‌ చేశారు.

గుంజన్‌ రట్టి అనే ఫేస్‌బుక్‌ యూజర్‌ దేశ్‌రాజ్‌ కోసం విరాళాలు సేకరణ చేపట్టారు. విరాళాలిచ్చిన వారందరికీ కృతజ్ఞతలంటూ హ్యూమన్‌ ఆఫ్‌ బాంబే దేశ్‌రాజ్‌ రూ. 24 లక్షల చెక్కును అందుకున్న ఫొటోను పోస్ట్‌ చేసింది. తనకు సహాయం అందించిన వారందరికీ కృతజ్ఞతలంటూ దేశ్‌ రాజ్‌ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న మరో వీడియోను కూడా పంచుకుంది.