తెనాలి నియోజకవర్గంలో అంబరాన్ని తాకిన సంక్రాంతి సంబరాలు

• మన ఊరు – మన ఆట కార్యక్రమాల్లో పాల్గొన్న శ్రీ నాదెండ్ల మనోహర్
తెలుగువారి సంప్రదాయ పండుగ సంక్రాంతి సంబరాల్లో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ఆదివారం ఉత్సాహంగా పాల్గొన్నారు. మకర సంక్రాంతి సంబరాల్లో భాగంగా భోగి రోజున నియోజకవర్గం అంతటా వివిధ గ్రామాల్లో జనసేన పార్టీ నాయకులు, వీర మహిళల ఆధ్వర్యంలో ‘మన ఊరు – మన ఆట’ కార్యక్రమాలు ఉల్లాసంగా మొదలయ్యాయి. మూడు రోజులపాటు సంప్రదాయాల కలబోతగా సాగే వివిధ రకాల ఆటలు ఆడుతూ.. ముచ్చటైన రంగవల్లులను వేసి మహిళలు సందడి చేశారు. హరిదాసుల కీర్తనలు, డూడూ బసవన్నల ఆటలు, సొంతూళ్లకు వచ్చిన యువకుల కేరింతలు… కొత్త అల్లుళ్ల సందడితో నిండుగా సంక్రాంతి సందడి గ్రామాల్లో కనిపించింది. తెనాలి నియోజకవర్గం పరిధిలోని నందివెలుగు, అత్తోట, కొలకలూరు, తూములూరు గ్రామాల్లో శ్రీ మనోహర్ గారు ఆదివారం పర్యటించి అక్కడి సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఆయా గ్రామాల్లో నిర్వహించిన రంగవల్లులు, వంటల పోటీలు, ఇతర సంక్రాంతి సంప్రదాయ ఆటల పోటీల్లో గెలుపొందిన మహిళలకు బహుమతులు అందించి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ ‘‘సంక్రాంతి పండుగ తెలుగువారి సంప్రదాయాలకు ప్రతీక. ప్రతి ఒక్కరూ సంతోషంగా గడిపే సమయంలో చేసుకునే గొప్ప వేడుక. అందరినీ ఒక దగ్గరకు చేరుస్తుంది. సొంతూళ్లకు వచ్చిన యువతరం రాష్ట్ర భవిష్యత్తు గురించి కూడా ఆలోచన చేయాలి. రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే జనసేన – తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు అవసరం. సంక్రాంతికి మంచి కార్యక్రమాలు నిర్వహించిన జనసేన నాయకులకు, వీర మహిళలకు ప్రత్యేక అభినందనలు’’ అన్నారు.