వైసీపీ భ్రాంతి వీడి.. రాష్ట్రానికి కాంతి రావాలి

• మందడం గ్రామంలో సంప్రదాయబద్ధంగా జనసేన – తెలుగుదేశం పార్టీల సంక్రాంతి సంబరాలు
• ఆంధ్ర ప్రదేశ్ స్వర్ణ యుగం కోసం సంక్రాంతి సంకల్పం
• వైసీపీ చీకటి జీవోలు, దమనకాండ చిత్రాలను భోగి మంటల్లో వేసిన నాయకులు
• సంబరాల్లో పాల్గొన్న శ్రీ పవన్ కళ్యాణ్, శ్రీ నారా చంద్రబాబు నాయుడు

అందరి జీవితాల్లో కొత్త కాంతులు నింపే సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే శుభ ఘడియల్లో తెలుగువారంతా సామూహికంగా రాష్ట్ర భావి సంకల్పానికి బీజం వేశారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలంటే, రాష్ట్రానికి కమ్ముకున్న వైసీపీ చీకట్లు పోవాలంటే ప్రజలంతా భోగి సంకల్పం తీసుకోవాలని జనసేన – తెలుగుదేశం పార్టీలు ఇచ్చిన పిలుపును ఆరు కోట్ల ఆంధ్రులు ఉత్సాహంగా స్వీకరించారు. రాబోయే జనసేన – తెలుగుదేశం ప్రభుత్వంలో తెలుగుజాతికి స్వర్ణయుగం రావాలంటే, ప్రజలంతా వైసీపీ పాలనతో కమ్మిన చీకట్ల నుంచి బయటకు రావాలంటూ జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు పిలుపునిచ్చారు. అమరావతిలోని మందడం గ్రామంలో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. తెలుగువారి వెలుగుల పండుగ భోగి మంటల్లో వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన చీకటి జీవోల ప్రతులను, గత నాలుగున్నర ఏళ్ల నుంచి రాష్ట్రంలో సాగిస్తున్న దమనకాండ చిత్రాలను వేసి దహనం చేశారు. రాష్ట్రానికి పట్టిన పీడ పోవాలని, ఆంధ్రప్రదేశ్ ధగధగలాడేలా సరికొత్తగా ఆవిర్భవించాలని ఆకాంక్షించారు. అనంతరం తెలుగువారి సంస్కృతికి అద్దం పట్టే పండుగ అయిన సంక్రాంతిని పురస్కరించుకొని మహిళలు వేసిన రంగవల్లులను తిలకించారు. గంగిరెద్దులు ఆటలు, హరిదాసుల కీర్తనలతో ఆ ప్రాంగణం నూతన శోభను సంతరించుకుంది. ఇరువురు నేతలు రైతులతో ప్రత్యేకంగా మాట్లాడారు. భావి తరాలకు పండుగ విశిష్టతను తెలియజేయాలని, ఆంధ్రుల సంస్కృతిని పదిలంగా అందించాలని కోరారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలతోపాటు జనసైనికులు, వీర మహిళలకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సంక్రాంతి శుభాకాంక్షలను తెలిపారు.