పారిశుద్ధ్య కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం దీపావళి కానుక

దీపావళి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం జీహెచ్ఎంసీ పరిధిలోని పారిశుద్ధ్య కార్మికులకు శుభవార్త వినిపించింది. పారిశుద్ధ్య కార్మికుల వేతనం రూ.14,500 నుంచి రూ.17,500కి పెంచుతున్నట్లు ప్రకటించింది.దసరా,దీపావళి వేళ ప్రజల సంతోషం కోరి సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు.శనివారం(నవంబర్ 14) మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్,మహమూద్ అలీ,మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులతో సమావేశమైన మంత్రి కేటీఆర్ సీఎం ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

కోవిడ్ 19పై పోరులో ముందుండి పోరాడిన యోధులకు ప్రభుత్వం బాసటగా నిలిచిందన్నారు. 2020లో కరోనా వైరస్ కారణంగా ఆర్థిక వ్యవస్థ తలకిందులైందని.. అయినప్పటికీ ప్రభుత్వ కార్యక్రమాలను నిరాటంకంగా కొనసాగిస్తున్నామని చెప్పారు. కరోనా నియంత్రణలో తెలంగాణ పనితీరును కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ అభినందించారని గుర్తుచేశారు. పారిశుద్ద్య కార్మికులతో పాటు గృహ యజమానులకు కూడా మంత్రి కేటీఆర్ దీపావళి కానుక ప్రకటించారు.