జమ్మూకాశ్మీర్ లో భీకర ఎన్కౌంటర్..

జమ్మూకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌లు సాధారమే. ఐతే శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌తో జైషే మహమ్మద్ ఉగ్రసంస్థకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఎందుకంటే ఆ సంస్థ కమాండర్ లంబూను భద్రతాదళాలు మట్టుబెట్టాయి. జమ్మూకాశ్మీర్‌లో శనివారం భీకర ఎన్‌కౌంటర్ జరిగింది. పుల్వామాలోని దాచిగామ్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతుల్లో జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ సౌత్ కాశ్మీర్ కమాండర్ లంబూ కూడా ఉన్నాడు. మరో ఉగ్రవాదిని మహమ్మద్ ఇస్మాయిల్ అల్విగా గుర్తించారు. వారి వద్ద నుంచి పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాను స్వాధీనం చేసుకున్నారు.

లంబూ అసలు పేరు.. అబు సైఫుల్లా.

అతడికి అద్నన్ అనే పేరు కూడా ఉంది. స్వస్థలం పాకిస్తాన్‌లోని పంజాబ్. జైషే మహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజర్‌కు అత్యంత సమీప బంధువు. 2019 పుల్వామా ఉగ్రదాడిలో అబు సైఫుల్లా కీలక పాత్ర పోషించాడు. ఆ ఘటనకు ఉపయోగించిన ఐఈడీ బాంబును సైఫుల్లానే తయారుచేశాడు. అబూ సైఫుల్లా 2017లో ఇండియాలోకి అక్రమంగా చొరబడ్డాడు. అప్పటి నుంచీ కాశ్మీర్‌లో తలదాచుకుంటూ ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు.

”2019లో జరిగిన పుల్వామా ఉగ్రదాడితో పాటు కాశ్మీర్లో జరిగిన పలు ఉగ్రదాడుల వెనక సైఫుల్లా హస్తముంది. జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ అగ్రనేతలు మసూద్ అజర్, రవుఫ్ అజర్, అమ్మన్‌కు ఇతు అత్యంత ఆప్తుడు.” అని పోలీసులు వెల్లడించారు.

సౌత్ కాశ్మీర్‌లో జైషే మహమ్మద్‌కు ఆపరేషనల్ కమాండర్‌గా పనిచేస్తున్నాడు సైఫులా. ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ అప్లికేషన్స్‌తో పాటు ఐఈడీ బాంబుల తయారీలో నిపుణుడు. అవంతిపోరా కేంద్రంగా కొంతకాలంగా ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. యువతను ఉగ్రవాదం వైపు ప్రేరేపిస్తున్నాడు. ఇవాళ జరిగిన ఎన్‌కౌంటర్ లంబూ హతమవడం భద్రతా దళాలకు గొప్ప విజయంగా చెప్పుకోవచ్చు.

కాగా, 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలోని అవంతిపొరా ప్రాంతంలో ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. రోడ్డుమార్గంలో వెళ్లున్న జవాన్ల కాన్వాయ్‌పై జైషే మహ్మద్ ఉగ్రవాది ఆదిల్ అహ్మద్ ఆత్మాహుతి దాడిచేశాడు. 100 కేజీల పేలుడు పదార్థాలు ఉన్న కారుతో జవాన్ల బస్సును ఢీకొట్టాడు. ఆ దాడిలో 40 మందికి పైగా జవాన్లు అమరులయ్యారు.