బోనాల ఉత్సవాలు.. ఆదివారం అంబర్‌పేట్‌లో, సోమవారం పాతబస్తీలో ట్రాఫిక్ ఆంక్షలు

బోనాల ఉత్సవాలు, ర్యాలీల సందర్భంగా నగరంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ వెల్లడించారు.

గోల్కొండ, సికింద్రాబాద్‌ మహంకాళి బోనాలు ప్రశాంతంగా జరిగినట్టే పాతనగర బోనాలు కూడా ప్రశాంతంగా ముగుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

పాతనగరంలోని అక్కన్న మాదన్న, సింహవాహిని, అంబర్‌పేట్‌లోని మహంకాళి ఆలయాలతో పాటు నగరంలోని వివిధ ప్రాంతాలలో బోనాల పూజలు, ర్యాలీలు కొనసాగుతాయన్నారు.

దీనికోసం ప్రత్యేక బందోబస్తు చర్యలు చేపట్టడంతో పాటు ప్రతి ఆలయం వద్ద ప్రత్యేక సిబ్బందిని కేటాయించి పర్యవేక్షిస్తున్నామని సీపీ అన్నారు.

సోమవారం పలుప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలుంటాయని తెలిపారు.