పురపాలక సంఘం సమావేశంలో దాడి అధికార పక్షం దౌర్జన్యానికి పరాకాష్ట

తెనాలి పురపాలక సంఘం సమావేశంలో శనివారం చోటు చేసుకున్న భౌతిక దాడి ఘటన అప్రజాస్వామికమని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ ఒక ప్రకటనలో ఖండించారు. పట్టణంలో సమస్యలను పరిష్కరించడం, అభివృద్ధి కార్యక్రమాలపై విలువైన చర్చలు చేయాల్సిన కౌన్సిల్ సమావేశాన్ని అధికార పక్షం తమ దౌర్జన్యానికి వేదికగా మార్చుకొంది. 20వ వార్డు కౌన్సిలర్ శ్రీ దేసు యుగంధర్ పై వైసీపీ పక్షం దాడి చేయడాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ప్రజా సమస్యలను ప్రస్తావిస్తే వైసీపీ దౌర్జన్యం చేస్తోంది. తెనాలి పట్టణ ప్రజలు ప్రశాంత జీవన విధానాన్ని కోరుకుంటారు. అధికార బలం ఉందని కౌన్సిల్ సమావేశంలోనే ప్రతిపక్షానికి చెందినవారిపై దాడులకు తెగబడితే ప్రజలు హర్షించరు. కచ్చితంగా ప్రజాస్వామ్య పద్ధతిలోనే సమాధానం ఇస్తారని శ్రీ నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు.