చమురు ధరల పెరుగుదలపై కేంద్రం, రాష్ట్రాలు భేటీ కావాలి..

ఢిల్లీ : దేశంలో రోజురోజుకూ ఇంధన ధరలు మండిపోతున్నాయి. వరుసగా 12వ రోజు కూడా పెట్రో, డీజిల్‌ ధరలు పెరిగాయి. పెరుగుతున్న చమురు ధరలపై కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. వినియోగదారులకు అందుబాటు ధరల్లోకి తీసుకువచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భేటీ కావాల్సిన అవసరముందని మంత్రి అభిప్రాయపడ్డారు. ధరల తగ్గుదల పరిష్కారం దిశగా చర్చలు సాగాలని అన్నారు పెట్రోల్‌, డీజిల్‌ రిటైల్‌ అమ్మకపు ధరల్లో వరుసగా 60శాతం, 54 శాతం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు విధిస్తున్నాయి. దీనిపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ ధరల పెరుగుదలపై ఆమె స్పందిస్తూ.. ఇంధన ధరలు తగ్గించడమే సమస్యకు పరిష్కారమని అన్నారు. లీటర్‌ పెట్రోల్‌పై 39 పైసలు, డీజిల్‌పై 37 పైసల మేర పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.90.58 కి చేరింది. డీజిల్‌ ధర రూ. 80.97కు పెరిగింది. ముంబైలో పెట్రోల్‌ ధర రూ.96.92, డీజిల్‌ రూ.87.62కి చేరాయి. హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.94.18గా ఉండగా.. డీజిల్‌ ధర రూ.88.31కి చేరింది. ఎపిలోని విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.96.26 కాగా.. లీటర్‌ డీజిల్‌ ధర రూ.89.84 గా ఉంది.