మత్స్యకారుల్ని ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది

•మత్య్సకారుల సంక్షేమానికి జనసేన కట్టుబడి ఉంటుంది
•క్రియాశీలక సభ్యులు పార్టీకి విలువైన ఆస్తి..వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిదీ
•రామన్నపాలెంలో క్రియాశీలక సభ్యుడి కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్ధిక సాయం అందచేసిన శ్రీ నాదెండ్ల మనోహర్

వైసీపీ ప్రభుత్వం మత్స్యకారులను చిన్నచూపు చూస్తోందని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు విమర్శించారు. ఎన్నికల సమయంలో వచ్చి హామీలు ఇవ్వడం మినహా వారి సంక్షేమానికి ముఖ్యమంత్రి చేసిందేమీ లేదని అన్నారు. మత్స్యకారులకు జనసేన పార్టీ అండగా ఉంటుందనీ, వారి సంక్షేమానికి కట్టుబడి ఉంటుందని హామీ ఇచ్చారు. తూర్పు గోదావరి జిల్లా, యు. కొత్తపల్లి మండలం, రామన్నపాలెం గ్రామానికి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు శ్రీ గెడ్డం రాజు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. బుధవారం జిల్లా పర్యటనలో భాగంగా శ్రీ రాజు ఇంటికి వెళ్లి అతని భార్య శ్రీమతి దుర్గా భవానిని పరామర్శించారు. అతని మరణానికి కారణాలు తెలుసుకుని ధైర్యం చెప్పారు. పార్టీ క్రియాశీల సభ్యులకు అందచేసే రూ. 5 లక్షల బీమా చెక్కును ఆమెకు అందచేశారు. ఎలాంటి అవసరం వచ్చినా స్థానిక నాయకత్వం మొత్తం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం స్థానిక మత్స్యకార యువత తమ సమస్యలు శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి చెప్పుకున్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా డీజిల్ సబ్సిడీ ఇస్తానని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని, వేటకు వెళ్లే మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలు వివరించారు. ఈ సందర్భంగా శ్రీ మనోహర్ గారు మాట్లాడుతూ… మత్య్సకారుల సమస్యలు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పీఏసీ సభ్యులు శ్రీ పంతం నానాజీ, శ్రీ ముత్తా శశిధర్, పార్టీ నాయకులు శ్రీమతి మాకినీడి శేషుకుమారి, శ్రీ తుమ్మల రామస్వామి, శ్రీ వై.శ్రీనివాస్, శ్రీ సంగిశెట్టి అశోక్, శ్రీమతి పొలాసపల్లి సరోజ, శ్రీ వాసిరెడ్డి శివప్రసాద్, శ్రీమతి చల్లా లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.