వరద బాధితుల గోడు ప్రభుత్వానికి పట్టడం లేదు

•బటన్ నొక్కడంతో బాధ్యత తీరిపోదు… మానవత్వంతో స్పందించాలి
గోదావరి వరద తీవ్రత తగ్గుముఖం పట్టినా ముంపు బాధితుల ఇక్కట్లు రోజురోజుకీ పెరుగుతున్నాయని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి తూర్పు గోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో వందల గ్రామాల ప్రజలు వరద నీట మునిగి ఇబ్బందులు పడుతున్నారు. వేల మంది బాధితులు ఉంటే నామమాత్రంగా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం చూస్తే వైసీపీ ప్రభుత్వం వరద పరిస్థితులపై ఏ మాత్రం అప్రమత్తంగా లేదని అర్థమవుతోంది. బటన్ నొక్కితే బాధ్యత తీరిపోయిందని వైసీపీ నాయకత్వం భావిస్తోంది. మానవత్వంతో స్పందించి సహాయ చర్యలు చేపట్టాలి. అయితే వరద బాధితుల గోడును పాలకులు పట్టించుకోవడం లేదు. బాధితులను ఆదుకోవాలని కోరితే- రాజకీయం చేస్తున్నామని వైసీపీ నాయకత్వం చెప్పడం ద్వారా వైఫల్యాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తోంది. ముంపు గ్రామాల ప్రజలను తరలించేందుకు కనీసం పడవలు కూడా ప్రభుత్వ సమకూర్చలేకపోయింది. ఆహారం కూడా ఇవ్వలేదు. రెండేళ్ల కిందట వచ్చిన వరదల సమయంలో పడవలు, ఆహారం సమకూర్చినవారికి నేటికీ బిల్లులు చెల్లించకపోవడం వల్లే ఈ పరిస్థితులు వచ్చాయి. ప్రస్తుతం నీట మునిగిన ఇళ్ళల్లోనే వరద బాధితులు బితుకుబితుకుమంటూ సహాయం కోసం చూస్తున్నారు. పసి పిల్లలకు కనీసం పాలు కూడా అందటం లేదనే విషయం నా దృష్టికి వచ్చింది. అన్నపూర్ణలాంటి కోనసీమ ప్రాంతంలో ఆహార పొట్లాల కోసం పెనుగులాడుకొనే పరిస్థితి కల్పించారు. జనసేన పార్టీ నేతలు, జన సైనికులు- ఇప్పటికీ ముంపులో ఉన్న గ్రామాల్లో సహాయ చర్యల్లో నిమగ్నమై ఉన్నారు. ఆహారం, పాలు, కూరగాయలు అందిస్తున్నారు. వారి సేవలు అభినందనీయమని జనసేనాని శ్లాఘించారు.