కరోనా విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం

రాష్ట్రంలో కరోనా పరీక్షలు, చికిత్సపై హైకోర్టులో న్యాయస్థానంలో విచారణ జరిగిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పై హైకోర్టు మరోసారి ఆగరహం వ్యక్తం చేసింది. కేసులు, మరణాలు చాలా తక్కువగా చూపిస్తూ రిపోర్టు చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణలో ప్రభుత్వ నిర్లక్ష్యo, ప్రైవేట్ ఆస్పత్రులు కట్టడి విషయంలో ప్రభుత్వ ఉదాసీన వైఖరి వంటి అంశాలపై దాఖలైన పిటిషన్ మీద ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

మార్చి 31 నుంచి ఇప్పటి వరకు కేవలం రోజుకు 8 లేదా 9, 10 మంది మాత్రమే కరోనా వల్ల చనిపోయారని ప్రభుత్వం రిపోర్టులు ఇవ్వడం మీద కోర్టు అనుమానం వ్యక్తం చేసింది. కరోనా కేసులు, మరణాలను తక్కువగా చూపుతున్నారని అభిప్రాయపడింది. దీంతో వెంటనే సమగ్ర నివేదిక అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే, ప్రజారోగ్య రంగాన్ని అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం ఎంత ఖర్చుపెట్టిందో చెప్పాలని పిటిషనర్ కోరగా, దీనిపై కూడా సమగ్ర నివేదిక ఇవ్వాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనాకి ముందు ఎంత నిధులు కేటాయించారు, కరోనా తర్వాత ఎంత కేటాయించారనే అంశాలను తెలియజేయాలని కోరింది. ఈనెల 22లోపు నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. ఒకవేళ తప్పుడు నివేదికలు సమర్పిస్తే చీఫ్ సెక్రటరీని కోర్టుకు పిలవాల్సి వస్తుందని న్యాయస్థానం హెచ్చరించింది. కేసు తదుపరి విచారణను ఈనెల 24కు వాయిదా వేసింది.