చైనా రక్షణ మంత్రి వీ ఫెంగీతో భారత రక్షణ మంత్రి రాజ్​నాథ్ భేటీ

చైనా రక్షణ మంత్రి వీ ఫెంగీతో భారత రక్షణ మంత్రి రాజ్​నాథ్​ మాస్కోలో భేటీ అయ్యారు. షాంఘై సహకార సంస్థ (ఎస్​సీఓ) సభ్య దేశాల రక్షణ మంత్రుల సదస్సు కోసం మాస్కో వెళ్లారు రాజ్​నాథ్​. ఇదే వేదికగా ఫెంగీతో సమావేశమయ్యారు.

ఇరు దేశాల మధ్య సరిహద్దుల్లో చోటు చేసుకుంటున్న తీవ్ర స్థాయి ఉద్రిక్తతల నేపథ్యంలో పలు కీలక అంశాలపై వీరు చర్చించినట్లు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. మే నెలలో తొలిసారి లద్దాఖ్‌లో సైనిక ఘర్షణ చోటుచేసుకున్న తర్వాత ఇరు దేశాల మధ్య ఉన్నతస్థాయి సమావేశం జరగడం ఇదే మొదటిసారి. లద్దాక్‌ సరిహద్దుల్లో నెలకొన్న తాజా ఉద్రిక్త పరిస్థితులపై ప్రధానంగా ఇరువురు చర్చించినట్లు తెలుస్తోంది.

భారత్‌, చైనా మధ్య లడఖ్ సరిహద్దు అంశం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసిన విషయం తెలిసిందే. పలుమార్లు రెండు దేశాల సైనికులు.. వాస్తవాధీన రేఖ వద్ద ఘర్షణకు కూడా దిగారు. దీంతో ఉద్రిక్తతలను తగ్గించేందుకు.. రెండు దేశాలు సైనిక, దౌత్యపరమైన చర్చలు కూడా చేపట్టాయి. ఈ నేపథ్యంలోనే ఇవాళ చైనా రక్షణ మంత్రి వీ ఫెన్‌గీతో రక్షణమంత్రి రాజ్‌నాథ్ భేటీ అయ్యారు.