కేంద్ర మంత్రి హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ రాజీనామా

ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న హర్‌సిమ్రత్‌ కౌర్‌ మంత్రి పదవికి రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ సంబంధ బిల్లులను నిరసిస్తూ కేంద్రమంత్రి పదవికి అకాలీదళ్‌ సభ్యురాలు హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామాను ప్రధాని మోదీ కార్యాలయంలో సమర్పించారు.

అయితే, రైతులు, వ్యవసాయ సంబంధఉత్పత్తులకు సంబంధించిన కీలక బిల్లులను కేంద్రం తీసుకురాగా.. వీటిలో అనేక అంశాలు రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయని, వ్యవసాయ రంగం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నుంచి మరింత ఇబ్బందుల్లో పడే అవకాశం ఉందని అకాలీదళ్‌ అభిప్రాయపడింది. అయితే కేవలం వ్యవసాయ బిల్లులను మాత్రమే వ్యతిరేకిస్తున్నట్టు చెప్పిన అకాలీదళ్‌ ప్రభుత్వానికి వెలుపల నుంచి మాత్రం మద్దతు ఉంటుందని తెలిపింది. కాగా పార్టీ విధానానికి మద్దతుగా ఉండేందుకు.. హర్‌సిమ్రత్‌ కౌర్‌ నేరుగా ప్రధాన మంత్రి కార్యాలయానికి వెళ్లి పదవికి రాజీనామా సమర్పించారు. లోక్‌సభలో వ్యవసాయ బిల్లులపై ఓటింగ్‌కు కొద్ది గంటల ముందు ఆమె రాజీనామా చేయడం కీలక పరిణామక్రమంగా మారితే.. లోక్‌సభలోనే పార్టీ నిర్ణయాన్ని ప్రకటించిన అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్‌బీర్‌ సింగ్‌ సంచలనం సృష్టించారు.. కాగా ఈ బిల్లులను వ్యవసాయ రంగంలో సంస్కరణల పేరిట ప్రజలలోకి తీసుకువెళ్లాలని బీజేపీ నిర్ణయించింది. ఇక ఈ బిల్లులపై పంజాబ్‌, హరియాణాకు చెందిన కొందరు రైతులు కొద్దిరోజులుగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు.