వారాహి ఆగదు… పోలీసులకు మా సహకారం ఉంటుంది

అసెంబ్లీ సమావేశాలు మంగళవారం నుంచి మొదలవుతున్నాయి. ఈ తరుణంలో మంగళవారం రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారి ప్రసంగం ఉండటం వల్ల పోలీసు శాఖ విజ్ఞప్తి మేరకు వారాహి యాత్రను ముందు అనుకున్నట్లు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభించడం లేదు. శాసనసభకు వచ్చే మంత్రులు, శాసనసభ్యులు, ఇతర వాహనాలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో వారాహి యాత్ర ప్రారంభం అయ్యే స్థలాన్ని విజయవాడ ఆటోనగర్ కు మారుస్తున్నాం అని పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారాహి వాహనంలో విజయవాడ ఆటోనగర్ నుంచి మచిలీపట్నం సభాస్థలికి బయలుదేరుతారు. ముందుగా ఎంపిక చేసిన అయిదు ప్రాంతాల్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలికేందుకు జన సైనికులు సిద్ధంగా ఉండాలి. పోలీసులకు పూర్తిగా సహకరిస్తూ క్రమశిక్షణ పాటించాలి. వారాహి వాహనానికి ఏమాత్రం అడ్డు రాకుండా సభా స్థలికి ఎంతో జాగ్రత్తగా శ్రీ పవన్ కళ్యాణ్ గారిని జనసైనికులు తీసుకు వచ్చేలా ప్రణాళికతో ముందుకు వెళ్దాం. ట్రాఫిక్ కు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. పోలీసు వారి వినతిని పరిగణనలోకి తీసుకొని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. చట్టాన్ని, చట్టాన్ని రక్షించే వారిని పూర్తిగా గౌరవించుకోవడం జనసేన పార్టీ మొదటి నుంచి పాటిస్తుంది. యాత్ర మార్పు స్థలాన్ని జనసైనికులు, వీర మహిళలు గమనించాలని శ్రీ నాదెండ్ల మనోహర్ కోరారు.