ఆవిర్భావ సభాస్థలి అందంగా ముస్తాబు

* శ్రీ పొట్టి శ్రీరాములు పుణ్య వేదికగా సభా వేదికకు నామకరణం
* సభ నిర్వహణ వాలంటీర్లకు నాదెండ్ల మనోహర్ సూచనలు
జనసేన పార్టీ పదో ఆవిర్భావ సభ ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. 34 ఎకరాల సువిశాల ప్రాంగణంలో కనీవినీ ఎరుగని రీతిలో సభ స్థలి ముస్తాబు అయ్యింది. ఎక్కడా ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా అన్ని వసతులతో సభా ప్రాంగణం సిద్ధం అయ్యింది. సభ వేదికకు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు పుణ్య వేదికగా నామకరణం చేశారు. సభకు వచ్చే వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేకంగా నియోజకవర్గాల వారీగా స్థలం కేటాయించడం జరిగింది. తాగునీటి సదుపాయం, వైద్య సదుపాయం, మరుగుదొడ్ల ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. సోమవారం సాయంత్రం సభా ప్రాంగణాన్ని పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు పరిశీలించారు. సభా ప్రాంగణం మొత్తం కలియతిరిగి మొత్తం ఏర్పాట్లు గురించి కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఎక్కడ ఏ ఏర్పాట్లు జరుగుతున్నాయో స్వయంగా పరిశీలించారు.
* వాలంటీర్లకు సూచనలు
సభా వేదిక పరిశీలన అనంతరం అక్కడే ఉన్న ఆవిర్భావ సభ వాలంటీర్లతో మనోహర్ మాట్లాడుతూ ” ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆవిర్భావ సభకు వాలంటీర్ల సేవలు చాలా కీలకం. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే జనసైనికులు, వీర మహిళలకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా వాలంటీర్లు పనిచేయాలి. నిబంధనల ప్రకారం పక్కాగా వ్యవహరించండి. సభకు వచ్చిన ప్రతి ఒక్కరినీ గౌరవించి, వారిని ప్రత్యేకంగా చూసుకోవడం వాలంటీర్ల బాధ్యత. పార్టీ ప్రతిష్ట పెంచేలా వాలంటీర్ల సేవలు ఉండాలి. పూర్తిస్థాయి లో సమన్వయం చేసుకొని పని చేయండి. కార్యక్రమాల నిర్వహణ కమిటీ సూచనలు తీసుకోండి. పోలీసు శాఖకు సహకరించి, సభ సజావుగా సాగేలా చూడాలి.
* ప్రత్యేక గీతం విడుదల
గబ్బర్ సింగ్ టీం ఆవిర్భావ సభ కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన గీతాన్ని మనోహర్ సోమవారం సభ వేదిక వద్ద విడుదల చేశారు. భగభగ మండే భగత్ సింగ్ అంటూ వచ్చే గీతం అందరిలో స్ఫూర్తి నింపేలా ఉంటుందని ఈ సందర్భంగా మనోహర్ గబ్బర్ సింగ్ టీంకు శుభాకాంక్షలు తెలియజేశారు. సభా వేదిక వద్ద మనోహర్ సమక్షంలో మచిలీపట్నం నియోజకవర్గానికి చెందిన వివిధ పార్టీల నాయకులు జనసేన పార్టీలో చేరారు.