కాబూల్ పేలుళ్ల ఘటనలో 90కి పెరిగిన మృతుల సంఖ్య

ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ లో నిన్న జరిగిన జంటపేలుళ్ల ఘటనలో మృతుల సంఖ్య 90కి పెరిగింది. హమీద్ కర్జాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు గేటు వద్ద జనంతో రద్దీగా ఉన్న ప్రాంతంలో ఈ ఆత్మాహుతి దాడులు జరగడం తెలిసిందే. తొలి పేలుడు ఎయిర్ పోర్టులోని అబ్బే గేటు వద్ద జరగ్గా, రెండో పేలుడు బేరన్ హోటల్ వద్ద చోటుచేసుకుంది.

మృతుల్లో అమెరికా మెరైన్ కమాండోలు కూడా ఉండడం పట్ల పెంటగాన్ వర్గాలు ఈ ఘటనను జీర్ణించుకోలేకపోతున్నాయి. ఆఫ్ఘన్ నుంచి నిష్క్రమిస్తున్న తరుణంలో అమెరికా అధినాయకత్వాన్ని రెచ్చగొట్టే చర్యగా రక్షణ రంగ నిపుణులు ఈ పేలుళ్లను అభివర్ణిస్తున్నారు. ఈ ఘాతుకం తమ పనే అని ఐసిస్ ఇప్పటికే ప్రకటించుకుంది.

నిజానికి ఈ పేలుడు ఘటనపై అమెరికా నిఘా వర్గాలు ముందే అప్రమత్తం అయ్యాయి. ఘటనకు కొన్ని గంటల ముందే హెచ్చరికలు జారీ చేసినా ఫలితం లేకపోయింది. అయితే, ఈ ఘటనకు కారకులపై ప్రతీకారం తప్పదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించినా, అది ఏ రూపంలో అన్నది స్పష్టత రాలేదు. ఆఫ్ఘన్ గడ్డపై అమెరికా బలగాలు కొనసాగడం అనేది ఏమాత్రం సాధ్యం కాదని స్పష్టమైంది. ఈ నేపథ్యంలో ఐసిస్ పై బైడెన్ ప్రతీకారం ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.