సంక్షేమ నిధి బొక్కిన జగన్

తాడేపల్లిగూడెం: కష్టమే ఆయుధంలా జీవించే కార్మికుల నోట్లో మట్టి కొట్టి వారికి ఇవ్వాల్సిన సంక్షేమ నిధిని జగన్ ప్రభుత్వం బొక్కేసిందని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెంలోని భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం భవనంలో సోమవారం రాత్రి నవనిర్మాణ కార్మికులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా సమయంలో ఇసుక లేక, పని లేక భవన నిర్మాణ కార్మికులు, ఇతర రంగాల కార్మికులు కష్టంలో ఉంటే వైసీపీ ప్రభుత్వం వారిని పట్టించుకోలేదని అన్నారు. స్థానిక మంత్రి కరోనా ఉన్న సమయంలో బెంగళూరులో కూర్చుంటే ప్రజల కష్టాలను తాము చూసామని మున్సిపల్ కార్మికులకు నిత్యవసర సరుకులు ఇస్తుంటే టిడిపి ఇన్చార్జి వలవల బాబ్జి పై మంత్రి కేసులు పెట్టించారని గుర్తు చేశారు. నియోజవర్గంలో ఎక్కడ చెరువు, కాలవ గట్టు, గ్రావెల్ క్వారీలు అన్ని ధనర్జన ధ్యేయంగా స్వాహా చేశారన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి వలవల బాబ్జి, బిజెపి నియోజకవర్గ కన్వీనర్ ఈతకోట తాతాజీ, భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు దువ్వ శ్రీను, టిడిపి జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు, భవన నిర్మాణ కార్మిక సంఘ నాయకులు పాల్గొన్నారు.