జనసేన సభకు స్థలం ఇస్తే గ్రామాన్ని నాశనం చేస్తారా?

•ఇళ్ల కూల్చివేత కచ్చితంగా కక్ష సాధింపు చర్యే
•ఇప్పటం ఏమైనా పాకిస్థాన్ లో ఉందా?
•ప్రజల్ని పరామర్శించేందుకు పవన్ కళ్యాణ్ పాస్ పోర్టు తీసుకుని వెళ్లాలా?
•బతికున్న మనుషులకు లేని విలువ.. వైఎస్సార్ విగ్రహాలకు ఉంది
•వైసీపీ పాలనకు ఇదే నిలువెత్తు నిదర్శనం
• పవన్ కళ్యాణ్ ని పోలీసులు ఎందుకు అడ్డుకున్నారో చెప్పాలి?
•రాజధానిలో రోడ్డు వేసే దిక్కులేదు.. ఇప్పటంలో 100 అడుగుల వెడల్పు ఎందుకు?
•వ్యవస్థలు అధికారంలో ఉన్న వారికి తొత్తులుగా పని చేస్తున్నాయి
•మంగళగిరి పార్టీ కార్యాలయంలో మీడియాతో జనసేన పార్టీ ముఖ్య నాయకులు

ఇప్పటం గ్రామం ఏమైనా పాకిస్థాన్ లో ఉందా..? శ్రీ పవన్ కళ్యాణ్ గారు పాస్ పోర్టు తీసుకుని వెళ్లడానికి అని జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు ప్రశ్నించారు. కక్ష సాధింపు చర్యగానే ఇప్పటంలో ప్రభుత్వం ఇళ్లు కూల్చేసిందనీ, బాధితులతో మాట్లాడేందుకు ఆంక్షలు ఏంటని నిలదీశారు. పార్టీ కార్యాలయం బయట పోలీసులు ఎందుకు అడ్డుకున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఇప్పటం గ్రామ సందర్శన అనంతరం శ్రీ గాదె వెంకటేశ్వరరావు, శ్రీ పోతిన మహేష్, శ్రీ షేక్ రియాజ్, శ్రీ మనుక్రాంత్ రెడ్డిలు మంగళగిరి పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
•ప్రభుత్వం దుర్బుద్ధితోనే ఇప్పటంలో ఇళ్లు కూల్చేసింది – గాదె వెంకటేశ్వరరావు
గుంటూరు జిల్లా అధ్యక్షులు శ్రీ గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. “మార్చి నెలలో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ సభకు ఇప్పటం గ్రామ ప్రజలు స్థలం ఇచ్చారన్న అక్కసుతోనే స్థానిక ఎమ్మెల్యే ఆ గ్రామ ప్రజల మీద కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలను యావత్ ప్రజానీకం జాగ్రత్తగా గమనించాలి. ఇప్పటం గ్రామస్తుల సొంత వాహనాలు మినహా మరే ఇతర వాహనాలు ఆ గ్రామంలోకి రావు. అలాంటి గ్రామానికి 120 అడుగుల రోడ్డు వేయడం దుర్బుద్ధితో కూడుకున్న ఆలోచనే. ఇళ్లు కూలగొట్టించి.. రాజకీయ కక్ష సాధింపు ఏ విధంగా ఉంటుందో ఇప్పటంలో చూపించారు. మాజీ ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి గారి విగ్రహం చుట్టూ కంచె వేసి, 50 మంది పోలీసులతో రక్షణ ఏర్పాటు చేశారు. వైసీపీ పాలనలో చనిపోయిన వ్యక్తుల విగ్రహాలకు ఉన్న విలువ బతికున్న మనుషులకు లేదు. అన్యాయంగా ఇళ్లు పగులగొట్టారు. వారిని పరామర్శించేందుకు వెళ్దామంటే ఉదయాన పార్టీ కార్యాలయానికి పోలీసులు వచ్చారు. జనసేన పార్టీని ఆపాలని చూస్తే ఏం జరుగుతుందో చూశారు. మేము రోడ్డు ఎక్కే పరిస్థితి తెస్తే ఇబ్బంది పడతారని శ్రీ పవన్ కళ్యాణ్ గారు హెచ్చరిస్తూనే ఉన్నారు. మీ తీరు మాత్రం మారలేదు. శ్రీ సజ్జల రామకృష్ణా రెడ్డి గారు మంచి సలహాలు ఇస్తే జనం మెచ్చుకుంటారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తికి పిచ్చి సలహాలు ఇవ్వవద్దు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో మార్పు తీసుకురావడానికి వచ్చారు. ప్రజలకు అండగా ఉండడానికి జనసేన పార్టీ స్థాపించారు. చేతనైతే పాలన చేయండి. లేదంటే ఏం చేయకుండా కూర్చోండి. త్వరలో మీ కుర్చీ కిందకు నీళ్లు రావడం ఖాయమన్న సంగతి గుర్తుంచుకోండి” అన్నారు.
•మహాత్ముడి విగ్రహాన్ని తాకే అర్హత ఈ ప్రభుత్వానికి లేదు – షేక్ రియాజ్
ప్రకాశం జిల్లా అధ్యక్షులు శ్రీ షేక్ రియాజ్ మాట్లాడుతూ.. “కక్ష సాధింపు ధోరణితోనే ఇప్పటం గ్రామంలో రోడ్ల వెడల్పు పేరు చెప్పి ఇళ్లు కూల్చేందుకు సిద్ధమయ్యింది. జనసేన పార్టీ ఆవిర్భావ సభ విజయంతో సభకు స్థలం ఇచ్చిన ఇప్పటం ప్రజల మీద కక్ష సాధిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం అనేది బతికుందా అని ప్రశ్నిస్తున్నాం. రాష్ట్రాన్ని ప్రత్యేక దేశంగా ప్రకటించి పాలిస్తున్నారా? శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రజల్ని పరామర్శించి భరోసా కల్పించేందుకు వెళ్తుంటే ఆపే ప్రయత్నం చేయడం ఏంటి? శ్రీ జగన్ రెడ్డి గారు దేశం దాటి వెళ్లాలంటే సీబీఐ కోర్టు అనుమతి తీసుకోవాలి. కష్టాల్లో ఉన్న ప్రజల దగ్గరకు వెళ్లడానికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి అనుమతి తీసుకోనసరం లేదు. రాష్ట్రవ్యాప్తంగా రోడ్లకు అడ్డంగా ఉన్న విగ్రహాలు అన్నీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారివే. మీకు దేశానికి స్వతంత్రం తెచ్చిపెట్టిన మహాత్మా గాంధీజీ బొమ్మ మాత్రం రోడ్డుకు అడ్డొస్తుంది. మహాత్ముడి విగ్రహాన్ని తీసివేయడానికి ఈ ప్రభుత్వానికి ఎలాంటి అర్హత ఉందో” చెప్పాలి అన్నారు.
• పవన్ కళ్యాణ్ గొంతు నొక్కాలని చూశారు – పోతిన మహేష్
విజయవాడ నగర అధ్యక్షులు శ్రీ పోతిన మహేష్ మాట్లాడుతూ.. “జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పటం గ్రామ సందర్శనకు వస్తే ఎందుకు అడ్డుకున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవస్థలు ఎవరికి అనుకూలంగా నడుస్తున్నాయి? అధికారంలో ఎవరు ఉంటే వారికి సీఐడీ, పోలీసులు అనుగుణంగా పని చేస్తాయా? ఒక గ్రామాన్ని సందర్శించి బాధితుల పక్షాన నిలబడడానికి ఇన్ని ఆంక్షలా? పోలీసు నిర్భందాన్ని దాటుకుని ఎంతో ఓర్పుతో ప్రయాణించి నడుచుకుంటూ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పటం చేరుకున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? నియంత ప్రభుత్వం సాగుతోందా? చట్టాన్ని చుట్టంలా మార్చుకుని ప్రజల పక్షాన మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ గారి గొంతు నొక్కాలనుకోవడం అవివేకం. రాష్ట్ర రాజధానిలో ఒక్క రోడ్డు వేయలేదు.. ఇప్పటంలో మాత్రం 120 అడుగుల రోడ్డు వేసి అభివృద్ధి చేస్తారంట. జాతీయ రహదారికి దూరంగా ప్రశాంతంగా ఉండే ఇప్పటంలో విధ్వంసం దేనికి. జనసేన ఆవిర్భావ సభకు సహకరించినందుకు ఆ గ్రామాన్ని సర్వనాశనం చేయాలనుకుంటారా? ఎమ్మెల్యే శ్రీ ఆళ్ల రామకృష్ణా రెడ్డి గారి ఇంటికి వెళ్లే రోడ్డు కేవలం 15 అడుగుల వెడల్పు మాత్రమే ఉంటుంది. ఇప్పటంలో చేస్తుంది అభివృద్ధి అంటే ఎవరైనా నమ్మే పరిస్థితేనా? మహాత్ముడి విగ్రహాన్ని కూలదోశారు. ఫ్యాక్షన్ రాజకీయాలకు కేరాఫ్ అయిన శ్రీ రాజశేఖరరెడ్డి విగ్రహానికి మాత్రం రక్షణ కంచెలు వేస్తారు. ప్రధాని పీఠం అలంకరించిన తెలుగు తేజం శ్రీ పీవీ నరసింహారావు గారి విగ్రహం తొలగించారు. వైసీపీ నాయకులు అంతకంటే గొప్పవారా? పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తానంటే చూస్తూ ఊరుకునేది లేదు” అని హెచ్చరించారు.
•జగన్నాటకంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు – చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి
నెల్లూరు జిల్లా అధ్యక్షులు శ్రీ చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి మాట్లాడుతూ.. “ఇప్పటం గ్రామంలో వేస్తామంటున్న 120 అడుగుల రోడ్డు ఆ గ్రామ ప్రజలపై కక్ష సాధింపు చర్యగానే పరిగణిస్తున్నాం. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది. జగన్నాటకంలో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. తండ్రి పేరు చెప్పి గెలిచారు.. ఓటు వేసిన ప్రజల ఇళ్లు కూల్చేస్తున్నారు. ఇళ్లు మొత్తం నిర్ధాక్షణ్యంగా కూల్చివేశారు. పవన్ కళ్యాణ్ గారు అందుకే ఆ గ్రామ ప్రజల్ని కలసి వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు” అని చెప్పారు. మీడియా సమావేశంలో పార్టీ నేతలు చిలకం మధుసూదన్ రెడ్డి, చిల్లపల్లి శ్రీనివాస్, టీసీ వరుణ్, నయూబ్ కమాల్, రవికాంత్, సంగిశెట్టి అశోక్ తదితరులు పాల్గొన్నారు.