వైసీపీ వ్యవసాయ రంగాన్ని అంధకారంలోకి నెట్టింది

•ప్రభుత్వం నుంచి స్పందన లేకే రైతుల ఆత్మహత్యలు
•రైతు కుటుంబాలకిచ్చే పరిహారంలోనూ ప్రజాప్రతినిధులు కమిషన్లు వసూలు చేశారు
•అధికారం లేకున్నా పవన్ కళ్యాణ్ సాయం చేస్తున్నారు
•సత్తెనపల్లి కౌలు రైతు భరోసా సభ వద్ద ఏర్పాట్లు పర్యవేక్షించిన నాదెండ్ల మనోహర్

వైసీపీ ప్రభుత్వ వైఖరితో రాష్ట్రంలో వ్యవసాయ రంగం అంధకారంలోకి వెళ్లిపోయిందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. వరుస నష్టాలు.. ముఖ్యమంత్రి-ప్రభుత్వం నుంచి స్పందన కరవైన పరిస్థితుల్లో బతుకు మీద ఆశ కోల్పోయి నిరుత్సాహంతో వేలాది మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు ఇచ్చే పరిహారంలోనూ కొంత మంది ప్రజాప్రతినిధులు కమిషన్లకు కక్కుర్తి పడ్డారని ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో చేతిలో అధికారం లేకపోయినా కష్టపడి సంపాదించిన డబ్బు వెచ్చించి ఆ రైతుల కుటుంబాలకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అండగా నిలుస్తున్నారన్నారు. ఈ కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నాలు చేయడం దారుణమన్నారు. పోలీస్ శాఖ కార్యక్రమం సజావుగా పూర్తి చేసేందుకు సహకరించాలని కోరారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సత్తెనపల్లి వేదిక వద్దకు చేరుకుని రైతు కుటుంబాలకు ఆర్ధిక సాయం చేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. శనివారం సాయంత్రం సత్తెనపల్లిలో ఏర్పాటు చేసిన జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్ర సభా ప్రాంగణం వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. ప్రధాన వేదిక నుంచి ప్రజలకు ఏర్పాటు చేసిన గ్యాలరీల వరకు అన్నింటినీ పరీక్షించి.. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతుల ఆత్మహత్యలపై రైతు స్వరాజ్య వేదిక అనే ఎన్జీవోతో కలసి స్పష్టమైన నివేదిక రూపొందించింది. పోలీసుల ఎఫ్ఐఆర్ కాపీలతోపాటు క్షేత్ర స్థాయిలో పరిశీలించగా ఆశ్చర్యకర విషయాలు వెలుగు చూశాయి. శ్రీ జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మూడు వేల మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రభుత్వం నుంచి భరోసా లేని పరిస్థితుల్లో అన్యాయంగా ప్రాణాలు తీసుకున్నారు. గుంటూరు జిల్లాలో క్షేత్ర స్థాయి పరిశీలన తర్వాత 281 మంది కౌలు రైతులు చనిపోయినట్టు నిర్ధారణకు వచ్చాం. ప్రభుత్వం అన్ని జిల్లాల్లో కొంత మందికి మాత్రమే ఇచ్చిన హామీ మేరకు రూ. 7 లక్షల పరిహారం అందించింది. అక్కడ ఉన్న స్థానిక నాయకత్వాన్ని బట్టి ఆ పరిహారం కూడా అందింది. జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్ర ప్రారంభించిన తర్వాత హడావిడిగా 1100 మందికి రకరకాలుగా సాయం అందచేశారు. కొంత మందికి రూ. 2 లక్షలు, కొంత మందికి రూ. లక్ష, ఇంకొంత మందికి రూ. 7 లక్షల పరిహారం ప్రాంతాన్ని బట్టి ఇచ్చారు. కొంత మంది ఖాతాల్లో విచిత్రంగా రూపాయి వేశారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి కార్యక్రమానికి వెళ్లకుండా మభ్యపెట్టే ప్రయత్నాలు చేశారు. వెళ్తే ప్రభుత్వం నుంచి వచ్చే ఏడు లక్షలు పోతాయని మాయమాటలు ప్రచారం చేశారు.
•రైతుల్ని కాపాడాల్సిందిపోయి దౌర్జన్యాలు చేస్తారా?
గుంటూరు జిల్లాలో కూడా రైతుల కుటుంబాలను అడ్డుకునే ప్రయత్నాలు మొదలయ్యాయి. మాచర్ల లాంటి ప్రాంతాల్లో వెళ్లడానికి వీల్లేదని బెదిరింపులకు పాల్పడుతున్నారు. రైతాంగాన్ని కాపాడాల్సిందిపోయి దాష్టికాలు, దౌర్జన్యాలకు దిగుతున్నారు. రైతు భరోసా యాత్రను ఒక రాజకీయ కార్యక్రమంగా చేయడం లేదు. సమాజానికి ఉపయోగపడాలన్న ఉద్దేశంతో, రైతుల కుటుంబాలకు అండగా నిలవాలన్న ఉద్దేశంతో శ్రీ పవన్ కళ్యాణ్ గారితో పాటు దేశ విదేశాల్లో ఉన్న పార్టీ సానుభూతిపరులు దాతలుగా ముందుకు వచ్చి ఈ కార్యక్రమానికి అండగా నిలబడ్డారు. రేపటి రోజున క్షేత్ర స్థాయిలో పరిశీలన తర్వాత జనసేన పార్టీ గుర్తించిన కుటుంబాలకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రూ. లక్ష చొప్పున ఆర్ధిక సాయం అందిస్తారు. పార్టీ జీవితకాలం తోడు ఉంటుందన్న భరోసా కల్పిస్తారు. రైతు కుటుంబాల్లో చిన్నారుల చదువుల కోసం ఆయా జిల్లాల నాయకత్వంతో కలసి ప్రత్యేక ట్రస్ట్ ఏర్పాటు చేయబోతున్నాం. కార్యక్రమానికి పోలీస్ శాఖ నుంచి సహకారం అవసరం. పార్టీపరంగా సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నాం.
•భయపెట్టాలని చూస్తే ప్రజలు తిరగబడతారు
మాచర్ల దాడులను ప్రజాస్వామ్య వాదులుగా ఖండిస్తున్నాం. ఎన్నికల సమయంలో ఇలా ఉద్దేశపూర్వకంగా గొడవలు సృష్టించాలని చూసేవారిని ప్రజలు దూరంగా పెట్టాలి. మాచర్ల నియోజకవర్గంలో 60 మందికి పైగా కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వారంతా సభకు రావాల్సి ఉంది. ఆంక్షల పేరిట వారికి ఆటంకాలు కలిగించవద్దు. వైసీపీ శాశ్వతంగా అధికారంలో ఉంటుందనుకోవద్దు. రాజకీయ పార్టీలు బాధ్యతగా వ్యవహరించాలి. దాడులతో ప్రత్యర్దుల్ని భయపెట్టి, వారి ఆస్తుల మీద, కుటుంబ సభ్యుల మీద దాడులకు పాల్పడడం బాధాకరం. ప్రజల్ని భయపెట్టాలని చూస్తే వారు తిరగబడతారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత వైసీపీ నాయకత్వంపై ఉంది అని అన్నారు. తుపాను, వర్షాలకు నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాల”న్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, గాదె వెంకటేశ్వరరావు, కళ్యాణం శివ శ్రీనివాస్, చిల్లపల్లి శ్రీనివాస్, సయ్యద్ జిలానీ, నయూబ్ కమాల్, బేతపూడి విజయ్ శేఖర్, నేరెళ్ల సురేష్, బండారు రవికాంత్, శ్రీమతి పార్వతినాయుడు తదితరులు పాల్గొన్నారు.