ఆంధ్రా అప్పుల భారం మోయలేనంత!

* రూ.8.71 లక్షల కోట్లకు చేరిన రుణాలు
* అయినా జీతాలకు నెలనెలా ఎదురుచూపులే
* కాంట్రాక్టర్ల బిల్లులు భారీగా పెండింగ్
* కొత్తగా టెండర్లు వేసే వారేరీ….

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ పతనం అంచుల్లో ఉంది. రుణ భారం ఊబిలో చిక్కి జగన్ ప్రభుత్వం కొట్టుమిట్టాడుతోంది. పరిస్థితి ఘోరాతిఘోరంగా ఉందని గత ఫిబ్రవరిలో సాక్షాత్తు రాష్ట్ర మంత్రిగా ఉన్న పేర్ని నాని చెప్పకనే చెప్పారు. డిమాండ్ల సాధనకు పట్టుబట్టిన ఉద్యోగులతో మాట్లాడుతూ “వస్తున్న ఆదాయం వడ్డీలకే పోతుంటే ఇంకెక్కడ సంక్షేమం ‘ అంటూ ఎదురు ప్రశ్న వేయడాన్ని మనమిప్పుడు గుర్తు చేసుకోవాలి. అప్పుల తిప్పలు తప్పడం లేదని ముఖ్యమంత్రి ఆర్థిక సలహాదారు దువ్వూరి కృష్ణ సైతం మునుపే అంగీకరించారు. వ్యవహారమంతా ‘అప్పుచేసి పప్పుకూడులా ఉంది’ అని ఇదివరకే ఒక సీనియర్ ఉన్నతాధికారి కూడా వ్యాఖ్యానించారు. ప్రభుత్వ తీరుతెన్నులన్నీఆర్ధిక అస్థిరతకు దారి తీశాయని కంప్టోలర్ అండ్ అడిటర్ జనరల్ (కాగ్) నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. కనీసం రోడ్ల మరమ్మతులకైనా ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఏనాడో తేల్చి చెప్పారు. పాలన పూర్తయ్యేలోగా ఎన్ని లక్షల కోట్ల రూపాయల అప్పు లెక్కతేలుతుందో చెప్పలేమని ఒకప్పటి ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు కొంతకాలం క్రితమే తీవ్ర ఆందోళన వ్యక్తపరిచారు. భారత రిజర్వ్ బ్యాంక్ ప్రకటనలు, రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై సర్వేలు ఎప్పటినుంచో చేదునిజాలను వెల్లడి చేస్తూ వస్తున్నాయి. వీటన్నింటి నేపథ్యంలో, సర్వం జగన్మాయగా కనిపిస్తోంది!
*అంధకారం మధ్య…
విపరీతంగా పెరిగి పోతున్న అప్పుల కుప్పను గమనిస్తే, ఆ మహాభారం ఇప్పటికే రూ.8.71 లక్షల కోట్లు దాటింది. అయినా రాష్ట్ర ఆర్థికానికి ఎటువంటి ఢోకా లేదని ఎలా అంటున్నారో సీఎంకే తెలియాలి! రుణాల సమీకరణలన్నీ ఏనాడో అంచనాలు దాటిపోయాయి. ఉద్యోగులకు బకాయిలే బకాయిలు!! ఎటుచూసినా పెండింగు బిల్లుల కోసం గగ్గోలు. అనేక శాఖల వారికి సమయానికి జీతాలు రావడం లేదు. ఉద్యోగ విరమణ చేసిన వారికి పింఛన్లు సకాలంలో జమకావడం లేదు. ఇదివరలో పనులు చేసి ఉన్న గుత్తేదారుల్లో పలువురికి బిల్లుల చెల్లింపులంటూ లేవు. ఇటువంటప్పుడు కొత్తగా నిర్మాణ, అభివృద్ది పనులు చేసేందుకు ఎవరు ముందుకొస్తారు? అసలు టెండర్లు దాఖలకైనా చాలా మంది సిద్ధంగా లేరు, ఇదంతా అలా ఉంచి, ‘మేం దాచుకున్న డబ్బునైనా ఇవ్వండి’ అని కోరుతున్న ఉద్యోగస్థులకు ఘనత వహించిన ప్రభుత్వం మొండి చెయ్యి చూపుతోంది. కొన్నేళ్లుగా కరవు భత్వం బకాయిల ఊసేలేదు. ఇంతటి దౌర్భాగ్యం ఎదురవుతుంటే, పరిశ్రమల స్థాపనకో, విస్తరణకో సిద్ధమయ్యేదెవరు? రాష్ట్రానికి వచ్చేవి తక్కువ. ఎక్కడెక్కడికి తరలివెళ్లేవి ఎక్కువ. ఉపాధి లేదు. ఆదాయం రాదు. ఏవిధమైన వృద్ధీ కనిపించదు. ఎటుచూస్తే అటు సమస్యల సందేహాల చిమ్మచీకట్లు!
* అన్నీ మాయమాటలే!
జగన్ సర్కారు చెప్పిందొకటి, చేసింది మరొకటి. రాష్ట్రంలో 2022-23లో రూ. 48, 724 కోట్ల రుణాలని వాడుకుంటామంది. కానీ ఆ అంచనాలన్నీ మొదటి ఆరునెలల్లోని కట్టుతప్పాయి. అప్పులు తెచ్చుకోవడమన్న’ కార్యక్రమం’ ఎంతకీ ఆగడం లేదు. ఈ తరహా ఆగడాలు ఇంకా కొనసాగితే, రుణాల మొత్తం ఇదే ఏడాది రూ. లక్ష కోట్లకు చేరువైనా ఆశ్చర్యపడనక్కర్లేదు. ఇక పెండింగు బిల్లుల మొత్తాలైతే కొండల్లా పేరుకుపోతున్నాయి. ఆదీ లక్షన్నర కోట్ల రూపాయల మేర ఉండవచ్చు. జీతభత్యాలకే దిక్కులేని దుస్థితి నెలకొందని, నెలలో సగం రోజులు గడిచినా పట్టించుకొనే నాధుడంటూ లేడని వివిధ శాఖలు, విభాగాల సిబ్బంది నిరసిస్తున్నారు. మరో తీవ్రాతి తీవ్ర సమస్య అప్పులపై వడ్డీ చెల్లింపుల భారం. అంతకుముందు రూ. పదివేల కోట్లుగా ఉన్న అవి 2020- 21 నాటికి రెట్టింపు అయ్యాయి. తాజా సంవత్సరంలో రూ. 22 వేల కోట్లకు పెరిగిపోయాయి. ఆదాయ, వ్యయ తేడాలు పెచ్చుపెరగడంతో- వాటిని పూడ్చటానికి చేస్తున్న రుణాలూ నానాటికీ పెరిగిపోతున్నాయి.
*కనుమరుగైన స్థిరత్వం
తీసుకొన్న అప్పులను ఏం చేయాలి? ఆదాయకర ఆస్తుల కోసం వాడుకోవాలి. ప్రగతి పనులకు ఖర్చుపెట్టాలి. ఏపీ ప్రభుత్వం మాత్రం అవసరాలు తీర్చుకునేందుకే తహతహలాడుతోంది. దీంతో ఆర్థికంగా స్థిరత్వం కనుమరుగైంది. ప్రధానంగా పెట్టుబడి వ్యయం పెరిగితేనే, పరిస్థితి బాగుపడుతుంది. దాదాపు రూ. 31,198 కోట్లను ఆ మేర ప్రతిపాదించినా వాస్తవానికి చేసిన ఖర్చు తొమ్మిది వేల కోట్ల రూపాయలైనా లేదు! ఇదే జగన్ హయాం నిర్వాకం. కేంద్ర పథకాల అమలుకు ఆ ప్రభుత్వం ఇచ్చిన నిధులనూ రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు వినియోగించుకొంది. పథకం లక్ష్యాలు నెరవేరకుండా చేసింది. ఇంకా సరికొత్త పన్నులు వేయాలని, ఎక్కడెక్కడి నుంచో నూతనంగా రుణాలు తీసుకురావాలనీ దారులు వెదుకుతోంది. అందుకు ఎన్ని తరహాల ప్రయత్నాలు సాగించిందో లెక్కేలేదు. అదీ కాకుండా ‘బటన్ నొక్కడు’ పేరిట సంక్షేమం సంక్షేమం అంటోంది. మరి ప్రజలకు కలిగించాల్సిన ప్రాథమిక సదుపాయాల మాటేమిటి? సంక్షేమానికి వ్యయం చేయకూడదని ఎవరూ అనరు. ఆ మొత్తం బడ్జెట్ కేటాయింపుల్లో మరీ విపరీతంగా, అడ్డూ అదుపూ లేకుండా ఉండకూడదు. ఎడాపెడా రుణాలు తీసుకోవడం, వాటిని ఎలా తీర్చాలన్న ఆలోచనైనా లేకపోవడం… రెండూ తప్పిదాలే ! వీటి వల్లనే సమస్త ఆర్థిక వ్యవస్థ రాష్ట్రంలో పట్టాలు తప్పింది.
* కార్పొరేషన్లూ అదే పనిలో….
మూలధన వ్యయం.. అంటే అభివృద్ధి కోసం చేసిన ఖర్చు సమాచారాన్ని కేంద్రానికి రాష్ట్రం వివరించాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ పాలకులు ఆ కనీస బాధ్యతనైనా పట్టించుకోకపోవడంతో, కేంద్రప్రభుత్వం గతంలో రూ. 5,309 కోట్ల దాకా కోత పెట్టింది. పైగా రాష్ట్రం తనకు ఉన్న పరిమితికి మించి నిరుడు అదనంగా అప్పులు తెచ్చింది. ఫలితంగా భారీగా కోత విధించింది కేంద్రం. ఇదికూడా కొన్ని వేల కోట్ల రూపాయలుంటుంది. పాత రుణాల కంటే అధికంగా రూ. 56 వేల కోట్లను జగన్ ప్రభుత్వం ‘ రాబట్టింది’. రెండేళ్ల కాలంలో ప్రభుత్వం గ్యారంటీతో కార్పోరేషన్ల ద్వారా ఆమేర పొందడం, అనంతర పరిస్థితులను దుర్భరంగా మార్చింది. ఇక ఇప్పుడు నెలవారీ వేతనాలు చెల్లించాలన్నా, పింఛన్లు అందించాలన్నా, పాత రుణాలకు వడ్డీలు జమచేయలన్నా, కొత్త అప్పులు చేయాల్సిందే! నెలనెలా ప్రభుత్వానికి ఇదే పని!! ప్రతీనెలా రూ. ఐదు వేల కోట్లు కొత్తగా రుణరూపేణా తీసుకోక తప్పదంతే !! అవి సకాలంలో పుట్టకపోతే, ఉద్యోగులకు జీతాల చెల్లింపుల్లో ఆలస్యం. అంటే, ప్రభుత్వాన్ని నెట్టుక రావాలంటే అప్పులు తేవాల్సి ఉంటుంది. రుణాల పరిమితి పరంగా కేంద్రం కోతలు విధించిన ప్రతిసారీ … ఏపీ మంత్రులు ఢిల్లీ ప్రయాణం చేయాల్సి వస్తోంది. అక్కడి పెద్దలతో మాట్లాడి.. బతిమిలాడి, పనులు చక్కబెట్టుకోవాల్సిన స్థితి. ఇంత ప్రమాదం చుట్టుముట్టి ఉన్నా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదన్నది ఆర్థిక నిపుణుల ప్రశ్న. ఆదాయ సాధన మార్గాలను చూసుకోకుండా, అప్పులకోసం ఎగబడటం సరికాదన్నది వారి విమర్శ.