నేటి నుంచి పట్టాలపైకి ప్రత్యేక రైళ్లు..

అన్‌లాక్ 4 మార్గదర్శకాల్లో భాగంగా కేంద్రం ప్రకటించిన 80 ప్రత్యేక రైళ్లకు నిన్నటి నుంచి రిజర్వేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. రేపటి నుంచి ఈ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ఇప్పటికే నడుస్తున్న 230 ప్రత్యేక రైళ్లకు ఇవి అదనమని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. కొత్త రైళ్ల వేళలు రెగ్యులర్ రైళ్లలానే ఉంటాయని భారతీయ రైల్వే తొలి సీఈవో వీకే యాదవ్ తెలిపారు. స్టాపులు మాత్రం ఆయా రాష్ట్రాల అభ్యర్థనను అనుసరించి ఉంటాయని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి గురువారం నుంచే టిక్కెట్ల బుకింగును కూడా రైల్వే శాఖ ప్రారంభించింది. దీంతో ప్రయాణికులు రైల్వే వెబ్‌సైట్‌ నుంచి భారీగానే టికెట్లు బుక్‌ చేసుకున్నారు. దేశవ్యాప్తంగా లాక్డౌన్‌ కారణంగా అన్ని సాధారణ ప్యాసింజర్‌ రైళ్లను మార్చి 25 నుంచి నిలిపివేసిన విషయం తెలిసిందే. వలసకార్మికుల కోసం మే నుంచి రైల్వే శాఖ కొన్ని శ్రామిక్‌ స్పెషల్‌ రైళ్ళను నడిపింది. మే 12 నుంచి 30 రాజధాని రైళ్లను, జూన్‌ 1 నుంచి 200 స్పెషల్‌ మెయిల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను పునఃప్రారంభించింది. ఇప్పుడు కొత్తగా ఢిల్లీ-ఇండోర్‌, యశ్వంత్‌పూర్‌-గోరఖ్‌పూర్‌, పూరి-అహ్మదాబాద్‌, ఢిల్లీ- బెంగళూరులను అలాగే ఇతర మార్గాల్లో కలిపే 80 రైళ్లు శనివారం నుంచి నడుపనున్నారు.