ఢిల్లీలో దారుణం.. ఆక్సిజన్ అందక 20 మంది మృతి..

దేశ రాజధానిలోని కొవిడ్ రోగులు తీవ్ర ఆక్సిజన్ కొరతను ఎదుర్కొంటున్నారు. తాజాగా ఢిల్లీలోని జైపూర్ గోల్డెన్ ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరతతో 20 మంది రోగులు ప్రాణాలు విడిచారు. మరో 200 మందికి పైగా ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని ఆస్పత్రి వర్గాలు పేర్కొంటున్నారు. మరో అర గంటకు మాత్రమే సరిపోయే ఆక్సిజన్ నిల్వులున్నాయని ఆస్పత్రి వర్గాలు పేర్కొంటున్న నేపథ్యంలో ఆందోళన నెలకొంది. లెక్క ప్రకారం శుక్రవారం సాయంత్రం 5 గంటల కల్లా ఆస్పత్రికి ఆక్సిజన్ సరఫరా అందాల్సి ఉంది. కానీ అర్ధరాత్రి 12 గంటలకు ఆక్సిజన్ అందింది. దీనిపై ఆస్పత్రి వర్గాలు మాట్లాడుతూ…. మరణించిన 20 మంది రోగులూ ఆక్సిజన్‌ సపోర్ట్‌తో ఉన్నారు. ఆక్సిజన్ సరిపడా లేని కారణంగా మేము ఆక్సిజన్ సరఫరా ఫ్లోను తగ్గించాం. అందరూ ఆక్సిజన్ అందక మరణించారని నేను అనడం లేదు. కానీ అదీ ఓ కారణమే అని హాస్పిటల్ వర్గాలు పేర్కొన్నాయి. కొన్ని రోజుల క్రితం కూడా ఇలాగే జరిగింది. ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత ఏర్పడింది. దీంతో 22 మంది కరోనా రోగులు మరణించారు.