మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్‌ అసెంబ్లీలో తీర్మానం

కేంద్రం ఏకపక్షంగా తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్‌ అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి రణదీప్‌ సింగ్‌ నభా ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ చట్టాలపై చర్చల్లో భాగంగా పంజాబ్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్దు మాట్లాడుతూ… ఈ మూడు చట్టాలకు శిరోమణి అకాలీదళ్‌ కారణమని, కాంట్రాక్ట్‌ ఫార్మింగ్‌ యాక్ట్‌.. 2013 చేయడం ద్వారా అప్పటి ముఖ్యమంత్రి ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌ ఈ చట్టాలకు నాంది పలికారని అన్నారు. అకాలీ-బిజెపి హయాంలో చేసిన ఈ చట్టాన్ని రైతు వ్యతిరేకమని, దీన్ని రద్దు చేయాలని సిద్దు కోరారు. ఈ రైతు చట్టాలకు అకాలీదళ్‌ మద్దతునిస్తోందని అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, ఆప్‌ ఎమ్మెల్యే హర్పాల్‌ సింగ్‌ చీమా వ్యాఖ్యానించారు. రైతు చట్టాలను చేసినప్పుడు అకాలీదళ్‌ అధినేత సుఖ్బీర్‌ సింగ్‌ బాదల్‌, మాజీ సిఎం ప్రకాష్‌ సింగ్‌ బాదల్‌, కేంద్ర మంత్రి హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ మద్దతు తెలిపి.. ఈ చట్టాలపై ఎప్పుడైతే నిరసనలు మొదలయ్యాయో.. అప్పుడు కూటమి నుండి వైదొలిగారని అన్నారు. కాగా, ఈ చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టినప్పుడు అకాలీదళ్‌ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుండి వాకౌట్‌ చేశారు.