2700 టన్నుల రసాయనం: 100 ను దాటిన ప్రాణ నష్టం

లెబనాన్‌ రాజధాని బీరుట్‌లోని పోర్టు ప్రాంతంలో మంగళవారం సాయంత్రం జరిగిన రెండు భారీ పేలుళ్లు ఘటనలో మృతుల సంఖ్య 100కు చేరింది. వేలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. పేలుళ్లుకు పెద్ద పెద్ద భవనాలు సైతం నేలమట్టం అయ్యాయి. భారీ భూకంపం సంభవిస్తే ఏస్థాయిలో విధ్వంసం ఉంటుందో అంతకన్నా ఎక్కువ స్థాయిలో భారీ ఆస్తి, ప్రాణనష్టం జరిగింది. ఇంతకీ ఈ పేలుళ్ల వెనుక ఉన్నదేమిటన్న సస్పెన్స్ కు తెర దించారు ఆ దేశ ప్రధాని.

ఒక గోదాములో దాచి ఉంచిన భారీ రసాయనాలే ఈ భారీ పేలుళ్లకు కారణంగా తేల్చారు. ఇంతకీ ఈ రసాయనం ఏమిటన్న ఆరా కు ఆ దేశం చెబుతున్న సమాధానం ‘ఆమ్మోనియం నైట్రేట్’. దాదాపు 2700 టన్నుల (ఒక్కో టన్ను వెయ్యి కేజీలతో సమానం. అంటే 2.7లక్షల కేజీలు) రసాయనమే ఇంత భారీ విధ్వంసానికి కారణంగా చెబుతున్నారు. ఎలాంటి రక్షణ చర్యలు లేకుండా ఈ స్థాయిలో రసాయనాల్ని నిల్వ ఉంచటం బాధ్యతారాహిత్యం అని దీనికి కారణమైన వారి విషయంలో తాము చర్య తీసుకుంటామని ఆ దేశ ప్రధాని హసాన్ దియాబ్ వ్యాఖ్యానిస్తున్నారు.