ఫైజర్ వ్యాక్సిన్ కి అమెరికా గ్రీన్ సిగ్నల్

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ఫైజర్ వ్యాక్సిన్ ప్రపంచంలోని పలు దేశాలకి ఆసరాగా నిలబడుతుంది. ఇప్పటికే బ్రిటన్ కెనడా బహ్రెయిన్ సౌదీ అరేబియా ఈ వ్యాక్సిన్ వినియోగానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా తాజాగా అమెరికా కూడా ఆ దేశాల సరసన చేరింది. ఇక అమెరికాలో త్వరలో ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. అమెరికాకే చెందిన ఈ ఫార్మూసూటికల్స్ సంస్థ.. జర్మనీకి చెందిన బయోఎన్టెక్తో కలిసి కరోనా వ్యాక్సిన్ను అభివృద్ధి చేసింది. ఇదివరకే భారత్ సహా అమెరికా బ్రిటన్ బ్రెజిల్ సహా అనేక దేశాల్లో దశలవారీగా క్లినికల్ ట్రయల్స్ను పూర్తి చేసుకుంది. ప్రయోగాల దశలో వచ్చిన ఫలితాలతో కూడిన పూర్తిస్థాయి నివేదికను ఫైజర్ కంపెనీ ప్రతినిధులు యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ కంపెనీకి పంపించారు. యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ కంపెనీ ఫైజర్ వ్యాక్సిన్ ను వినియోగించాలా వద్దా అనే అంశంపై ఎఫ్ డీఏ నిపుణులతో కూడిన ప్యానెల్ ప్రత్యేకంగా ఓటింగ్ చేపట్టింది. మొత్తం 22 మంది ప్యానెల్ సభ్యులు ఓటింగ్ లో పాల్గొన్నారు. వినియోగానికి అనుకూలంగా 17 మంది ఓటు వేశారు. వ్యతిరేకంగా నాలుగు ఓట్లు పోల్ అయ్యాయి. ఒక ఓటును పరిశీలనలో ఉంచారు. భారీ మెజారిటీతోో ఎఫ్ డీఏ ప్యానెల్ వ్యాక్సిన్ వినియోగానికి తన అంగీకారాన్ని వ్యక్తం చేయడంతో..తొలిదశ అడ్డంకిని అధిగమించినట్టయింది. ఎఫ్ డీఏ అనుమతి పొందిన ఈ ప్రతిపాదనలను అక్కడి హెల్త్ రెగ్యులేటరీ మంత్రిత్వశాఖ ఆమోదించాల్సి ఉంది.

ఫైజర్ బయోఎన్ టెక్ వ్యాక్సిన్ వినియోగానికి వారం రోజుల్లో అనుమతి ఇచ్చేలా చర్యలను తీసుకుంటామని అమెరికా వైద్య శాఖ మంత్రి అలెక్స్ అజర్ తెలిపారు. వ్యాక్సిన్ ట్రాన్స్పోర్టేషన్ స్టోరేజీ కోసం అవసరమైన రూట్ మ్యాప్ బ్లూప్రింట్ సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ప్రాధాన్యత క్రమంలో వ్యాక్సిన్ను అమెరికన్లకు అందజేస్తామని చెప్పారు. ఒకేరోజు మూడువేల మంది కరోనా బారిన పడి మరణించారు. మొత్తం మరణాలు మూడు లక్షలకు చేరువ అయ్యాయి. కోటి 60 లక్షల మందికి పైగా అమెరికన్లకు ఇప్పటిదాకా కరోనా వైరస్ సోకింది. ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కడానికి ఫైజర్ వ్యాక్సిన్ను వీలైనంత వేగంగా అందుబాటులోకి తీసుకుని రావాలని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది.