India vs England: అర్ధసెంచరీతో చెలరేగిన శార్దూల్‌.. మరోసారి చేతులెత్తేసిన భారత్‌!

టీమిండియా బ్యాట్స్‌మన్‌ అంతా కట్టకట్టుకొని విఫలమైన వేళ.. టెయిలండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ (36 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 57) ధనాధన్‌ అర్ధ సెంచరీతో చెలరేగాడు. టి20 తరహా బ్యాటింగ్‌తో 8వ వికెట్‌కు 63 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని అందించాడు. అంతకుముందు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (96 బంతుల్లో 8 ఫోర్లతో 50) అర్ధ సెంచరీ సాధించడంతో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌ ఫస్ట్‌ ఇన్నింగ్స్‌లో భారత్‌ 191 పరుగులు చేయగలిగింది. చల్లని వాతావరణం, పిచ్‌ నుంచి లభించిన సహకారంతో ఇంగ్లాండ్‌ బౌలర్లు చెలరేగడంతో టీమిండియా బ్యాట్స్‌మన్‌ మరోసారి చేతులెత్తేసారు. ఓ దశలో 39 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన భారత జట్టు కనీసం 100 పరుగులైన చేస్తుందా? అనిపించింది. కానీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో 100 పరుగుల మార్క్‌ను ధాటింది. ఆ తర్వాత అతను ఔటవ్వడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. వరుసగా వికెట్లు చేజార్చుకొని 127/7 పీకల్లోతు కష్టాల్లోకి కూరుకుపోయింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన శార్దూల్‌ ఠాకూర్‌ ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. ధాటిగా ఆడుతూ ఇంగ్లాండ్‌ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 7 ఫోర్లు, 3 సిక్సర్లతో వీరవిహారం చేశాడు. రాబిన్సన్‌ వేసిన 60 ఓవర్‌లో4, 6 బాదిన శార్దూల్‌.. 31 బంతుల్లో కెరీర్‌లో రెండో అర్థశతకం అందుకున్నాడు. శార్దూల్‌ ఔటైన వెంటనే మూడు బంతుల వ్యవధిలోనే భారత్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. శార్దూల్‌ ధనాధన్‌ ఇన్నింగ్స్‌తోనే భారత్‌ గౌరవ ప్రదమైన స్కోర్‌ చేయగలిగింది.