తుపాను మృతుల కుటుంబాలకు అండగా ఏపీ ప్రభుత్వం.. రూ.5లక్షలు ప్రకటించిన సీఎం జగన్..

గులాబ్ తపాను ఉత్తరాంధ్రపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. శ్రీకాకుళం , విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో పాటు గోదావరి, దక్షిణకోస్తా జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ ధాటికి ఇళ్లు, విద్యుత్ స్తంభాలు వృక్షాలు కూలిపోయాయి. వేలాది ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. తుపాను మిగిల్చిన నష్టంపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. తుపాను కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రూ. 5లక్షల పరిహారాన్ని ప్రకటించారు. పరిహారం తక్షణమే చెల్లించాలని అధికారులను ఆదేశించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగవంతం చేయాలన్నాన్న జగన్.. సాయం విషయంలో మానవతా దృక్పథంతో ఉదారంగా వ్యవహరించాలని సూచించారు. అవసరమైన అన్ని చోట్ల సహాయక శిబిరాలను తెరవాలని, ఇళ్లలోకి నీరు చేరి ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు రూ. వెయ్యి చొప్పున, సహాయక శిబిరాల నుంచి బాధితులు వెళ్లేటప్పుడు కుటుంబానికి రూ. వెయ్యి చొప్పున ఆర్థిక సాయం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.