జిన్ను షేక్ నగర వాసులకు జనసేన అండగా ఉంటుంది

  • నలభై ఏళ్లుగా ఉంటున్నవారిని ఉన్నఫళంగా వెళ్ళిపొమ్మంటే ఎక్కడికి పోతారు
  • పేదలపై వైసీపీ నేతల నిరంకుశ ధోరణిని సహించే ప్రసక్తే లేదు
  • వైసీపీ నేతలకు నిర్మించడం రాదు కానీ కూల్చటానికి ముందుంటారు
  • పన్ను రూపంలో కోట్లు వసూలు చేస్తూ కూడా మౌళిక సదుపాయాలు కల్పించలేని స్థితిలో స్థానిక పాలనా యంత్రాంగం
  • జనసేన నగర అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్

గుంటూరు: నలభై ఏళ్లుగా నివాసం ఉంటున్న పేదలకు పునరావాసం కల్పించకుండా ఉన్నఫళంగా ఇళ్ళు ఖాళీ చేయమంటూ అధికారులను అడ్డం పెట్టుకొని వైసీపీ నేతలు ఒత్తిడి చేయటం దుర్మార్గమని, జిన్ను షేక్ నగర వాసులకు జనసేన పార్టీ అండగా ఉంటుందని గుంటూరు జనసేన పార్టీ నగర అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ అన్నారు. స్థానిక పదవ డివిజన్ పరిధిలోని జిన్ను షేక్ నగర్ లో ఆయన ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు అధికారులు, స్థానిక వైసీపీ నేతలు తమ ఇళ్లను ఖాళీ చేయమంటున్నారని, చిన్న పిల్లల్ని, ముసలి వాళ్ళని తీసుకొని మేమెక్కడ తలదాచుకోవాలని నేరేళ్ళ సురేష్ ముందు కన్నీటి పర్యంతమయ్యారు. తమ ప్రాంతంలో కాలువలు కూడా సరిగ్గా తియ్యటం లేదని, అదేమని అడిగితే సరిగ్గా సమాధానం చెప్పకపోగా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్థానికులను ఉద్దేశించి నేరేళ్ళ సురేష్ మాట్లాడుతూ ఎవరూ కూడా అధైర్యపడవద్దని, జనసేన పార్టీ మీకు పూర్తిగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వైసీపీ నేతలకు కూల్చటమే కానీ నిర్మించడం రాదని విమర్శించారు. అభివృద్ధికి జనసేన ఎప్పుడూ సహకరిస్తుందని, ఆ క్రమంలో పేదలకు అన్యాయం జరిగితే సహిస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. పూర్తిస్థాయిలో పునరావాసం కల్పించకుండా ఇల్లు ఖాళీ చేయమంటే ప్రజలు ఎక్కడికి వెళ్తారని ప్రశ్నించారు. ఇక ఇక్కడి కాలువల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని, మురుగును చూస్తుంటే ప్రజలు ఎలా జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, పాలకులు ఒక్కరోజు ఇక్కడ నివసిస్తే ప్రజలు పడుతున్న నరకయాతన తెలుస్తుందన్నారు. పన్నుల రూపంలో కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్నా కూడా ప్రజలకు మౌళిక సదుపాయాలు కల్పించటంలో పాలకులు, అధికారులు విఫలమయ్యారని దుయ్యబట్టారు. కాలనీని సందర్శించిన వారిలో జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి, నగర ఉపాధ్యక్షుడు కొండూరి కిషోర్, చింతా రేణుకారాజు, ప్రధాన కార్యదర్సులు ఆనంద్ సాగర్, ఉపేంద్ర, కటకంశెట్టి విజయలక్ష్మి, బండారు రవీంద్ర, సోమి ఉదయ్, నాగరాజు, కార్తిక్, సుంకే శ్రీను, మహంకాలి, పుల్లంసెట్టి ఉదయ్, పులిగడ్డ గోపి, ఆసియా, ఆశా, అరుణ, హేమ, సామ్రాజ్యఒ, రోశయ్య, శేఖర్, శాంతి ప్రసాద్, దుర్గాప్రసాద్, బాలకృష్ణ, కవిత, శ్రీను నాయక్, ఏడుకొండలు, నరేష్ తదితరులు పాల్గొన్నారు.