నారాయణస్వామి వ్యాఖ్యలపై నిప్పులు చెరిగిన యుగంధర్

  • ప్యాకేజి తీసుకున్నట్టు నిరూపిస్తే నీ పాదరక్షలు నా తలమీద పెట్టుకొని ఊరేగుతా
  • నిరూపించక పొతే నా పాదరక్షలతో నిన్ను వెయ్యిన్ని నూట పదహారు సార్లు కొడతా
  • డీల్ ఓకేనా స్వామీ
  • సవాల్ విసిరిన జనసేన ఇంచార్జ్ యుగంధర్

గంగాధర నెల్లూరు నియోజకవర్గం: కార్వేటి నగరం మండల కేంద్రంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి పవన్ కళ్యాణ్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గం ఇంచార్జ్ యుగంధర్ మాట్లాడుతూ ఎదిరిస్తానని చెప్పిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చివరకు చంద్రబాబు దగ్గర ప్యాకేజీ తీసుకొని పార్టీని తాకట్టు పెట్టడం సిగ్గుచేటని చెప్పడంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్యాకేజీ తీసుకున్నట్టు నిరూపిస్తే నీ పాదరక్షలునా తల పైన పెట్టుకుని నగరం పురవీధులలో ఊరేగుతాను, అలా నిరూపించకపోతే పవన్ కళ్యాణ్ చూపించింది ఒక చెప్పు అయితే, నేను నా రెండు చెప్పులతో వెయ్యిని నూటా పదహారు సార్లు నిన్ను కొడతానని, డీల్ ఓకేనా స్వామి అని సవాల్ విసిరారు. 2014లో ప్రశ్నిస్తా అని పార్టీ పెట్టి చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ బేరం కుదుర్చుకున్నాడని అంటే నువ్వేనా ఆ బ్రోకర్ వి, బేరం కుదుర్చుకున్నప్పుడు నువ్వు ఏమైనా బ్యాటరీ వేసావా? లేదా మొత్తానికి నువ్వేనా బ్రోకర్ అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజుల కండ్రిక గ్రామంలో నాలుగవ తేదీ గడపగడప కార్యక్రమం ఉందని అక్కడ జనసేన పార్టీ నాయకులు ఏర్పాటుచేసిన బ్యానర్లను తొలగించాలని అధికారులు చేత ఒత్తిడి చేయించడం, దానికి సెక్రటరీని పావుగా వాడడం ఎంతవరకు సమంజసమని, నీకు సిగ్గు ఉంటే అక్కడ జనసేన బ్యానర్ల కంటే మీ బ్యానర్లు వెయ్యి ఎక్కువ కట్టి సత్తా నిరుపించుకోండని ఎద్దేవా చేశారు. అక్కడున్న బ్యానర్లను తీయించే దౌర్జన్యం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని, అదేరోజు ఆర్కే వీబి పేట మెయిన్ రోడ్ లో ధర్నా చేస్తానని తెలిపారు. ఈ నియోజకవర్గంలో ఎంతోమంది ఎస్సీ నాయకులను నియోజకవర్గస్థాయి నాయకులుగా, ఎమ్మెల్యే, ఎంపీ స్థాయి నాయకులుగా, చేసిన ఘనత జనసేనదని, నువ్వు ఎంతమందిని నీ తదనంతరం ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులుగా తయారు చేశావు అని తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు. ఆర్కే వీబిపేట గ్రామంలో తారు రోడ్డు మీద మట్టి రోడ్డు వేసిన ఘనత మీదేనని, రాజుల కండ్రిక గ్రామంలో ఇంకా కొంతమందికి ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని, జగన్నాధ పురానికి రోడ్డు లేదని, బిల్లుదొనకు రోడ్డు సౌకర్యం లేదని, కార్వేటి నగరం మండలాన్ని, వెదురుకుప్పం మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపలేదని, కార్వేటి నగరం డైట్ కేంద్రానికి రోడ్డు లేదని, సిగ్గు ఉంటే వాటిని చేయాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో కార్వేటినగరం మండల అధ్యక్షులు శోభన్ బాబు, మండల ఉపాధ్యక్షులు విజయ్, ప్రధాన కార్యదర్శి నరేష్, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, మండల బూత్ కన్వీనర్ అన్నామలై పాల్గొన్నారు.